Celina Jaitly: రూ. 100 కోట్ల పరిహారం, నెలకూ 10 లక్షల భరణం.. భర్త వేధింపులపై కోర్టుకెక్కిన బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ!

Celina Jaitly: రూ. 100 కోట్ల పరిహారం, నెలకూ 10 లక్షల భరణం.. భర్త వేధింపులపై కోర్టుకెక్కిన బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ!

బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లీ తన 15 ఏళ్ల వైవాహిక జీవితం వెనుక ఉన్న చీకటి కోణాలను బయటపెట్టింది. తన భర్త పీటర్ హాగ్ తనను శారీరకంగా, మానసికగా ,ఆర్థికంగా వేధించారంటూ ఆమె ముంబైలోని అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం నాడు ఈ కేసు విచారణకు హాజరైన సెలీనా, తనపై జరిగిన అకృత్యాలను పిటిషన్‌లో వివరించింది.  ఇప్పుడు ఈకేసు వ్యవహారం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సెలీనా రూ. 100 కోట్లు డిమాండ్

తన ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, ఆత్మగౌరవాన్ని పీటర్ దెబ్బతీశారని సెలీనా ఆవేదన వ్యక్తం చేసింది. తన పిటిషన్‌లో ఆమె రూ. 100 కోట్ల నష్టపరిహారంతో పాటు, నెలవారీ ఖర్చుల కోసం రూ. 10 లక్షల భరణం (Maintenance) కావాలని కోరింది. 2010లో వివాహం చేసుకున్న ఈ జంట ముంబై, దుబాయ్, సింగపూర్ ,  ఆస్ట్రియా వంటి నగరాల్లో నివసించారు. అయితే పీటర్ తన కెరీర్‌ను అడ్డుకున్నారని, తన సంపాదనను కూడా తనే వాడుకున్నారని సెలీనా ఆరోపించింది.

సెలీనా ఆరోపణలు..

 తన డెబిట్, క్రెడిట్ కార్డులను పీటర్ తన ఆధీనంలో ఉంచుకుని, ఇంటి ఖర్చుల పేరిట సొంతానికి వాడుకున్నారని సెలీనా జైట్లీ ఆరోపించింది. అంతేకాకుండా ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన గిఫ్ట్ డీడ్‌పై తన మానసిక స్థితి సరిగా లేని సమయంలో సంతకం చేయించుకున్నారని, ఆ తర్వాత ఆ ఇంటిని రెంట్ కు ఇచ్చి రూ. 1.26 కోట్లు సంపాదించారని సెలీనా ఆరోపించింది. అలాగే వియన్నాలో జాయింట్ గా ఉన్న ఆస్తిని తన అనుమతి లేకుండా విక్రయించారని వెల్లడించింది.

పిల్లలకు దూరంగా..

 పీటర్ తనను పిల్లలకు కూడా దూరం చేశారని సెలీనా కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం పిల్లలు పీటర్ వద్ద ఉండగా, రోజుకు కేవలం ఒక గంట మాత్రమే ఫోన్‌లో మాట్లాడే అవకాశం కోర్టు కల్పించింది. అయితే భారత్‌లో కేసు వేసిన తర్వాత ఆ ఫోన్ కాల్స్ కూడా ఆగిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది..

కోర్టు కీలక ఆదేశాలు

ఈ కేసును విచారించిన ముంబై కోర్టు, ఇద్దరి ఆర్థిక స్థితిగతులను పరిశీలించేందుకు గాను జనవరి 27వ తేదీలోపు ఇద్దరూ తమ ఆదాయ అఫిడవిట్లను సమర్పించాలని ఆదేశించింది. అలాగే సెలీనా ఆరోపణలపై పీటర్ హాగ్ తన అధికారిక సమాధానాన్ని కూడా దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపింది.  మరోవైపు ఆస్ట్రియాలో కూడా వీరిద్దరి విడాకుల ప్రక్రియ కొనసాగుతోంది. అక్కడ పీటర్ హాగ్ సెలీనాపైనే ఆరోపణలు గుప్పించారు. తన వివాహ బంధం విచ్ఛిన్నం కావడానికి సెలీనానే కారణమని ఆయన కోర్టులో వాదిస్తున్నారు.

ఎవరీ సెలీనా జైట్లీ?

తెలుగులో విష్ణు మంచు హీరోగా వచ్చిన 'సూర్యం' సినిమాతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరైంది సెలీనా. అంతకుముందు 2001లో 'మిస్ ఇండియా'గా నిలిచిన ఈ భామ, బాలీవుడ్‌లో నో ఎంట్రీ, గోల్‌మాల్ వంటి హిట్‌ చిత్రాల్లో నటించింది. తెరపై ఎంతో అందంగా, సంతోషంగా కనిపించే నటి జీవితంలో ఇంతటి విషాదం ఉందన్న విషయం తెలిసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఈ కేసులో న్యాయం ఎవరి వైపు ఉందో తెలియాలంటే జనవరి 27 వరకు వేచి చూడాల్సిందే..