న్యూఢిల్లీ: ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ వ్యూహాలు ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఐపీఎల్‌లో సీనియర్ సిటిజన్స్ టీమ్‌గా పేరుగాంచిన సీఎస్కే ఈసారి పూర్తిగా స్ట్రాటజీ మార్చింది. సీనియర్ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపని సీఎస్కే భారత అన్ క్యాప్డ్ ఆటగాళ్లపై ఫోకస్ పెట్టింది. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన ఇండియా యువ క్రికెటర్స్ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మలను రికార్డ్ ధరకు దక్కించుకుంది.
ఈ ఇద్దరు చిచ్చర పిడుగులను ఎవరూ ఊహించని విధంగా చెరో 14.2 కోట్ల చొప్పున కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన అన్ క్యాప్డ్ ప్లేయర్లుగా ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ చరిత్ర సృష్టించారు. కనీసం ఒక్క ఇంటర్నేషనల్ మ్యా్చ్ కూడా ఆడని ఈ ఇద్దరి కోసమే చెన్నై ఏకంగా 28.4 కోట్లు కుమ్మరించడం క్రీడా వర్గాలను విస్మయానికి గురి చేసింది.
ఐపీఎల్ ఆక్షన్‌లో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే పేరు చెన్నై ఫ్రాంచైజీకి ఉంది. చెన్నై ఒక ఆటగాడిని అంతా ఆషామాషీగా కొనుగోలు చేయదని.. రూపాయి పెడితే రెండు రూపాయల లాభం వచ్చేలా చూసుకుంటుందని టాక్. అలాంటిది ఇండియా తరుఫున ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడని ఇద్దరు యువ ఆటగాళ్ల కోసం ఇంత ఖర్చు పెట్టిందంటే వారిలో మ్యాటర్ బానే ఉన్నట్లేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చెన్నై వ్యూహాలు ఎవరికీ అర్ధం కావంటున్నారు. ఈ క్రమంలోనే చెన్నై కళ్లు చెదిరే ధరకు కొనుగోలు చేసిన ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మల గురించి నెట్టింట తెగా వెతుకుతున్నారు.
ప్రశాంత్ వీర్ బ్యాగ్రౌండ్:
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల ప్రశాంత్ వీర్ ఆల్ రౌండర్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్‌తో పాటు హార్డ్ హిట్టింగ్ చేయగలడు. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలా ఆడగల సత్తా ఉంది. ముఖ్యంగా లోయర్ ఆర్డర్‌లో వచ్చి భారీ షాట్లు కొట్టగలడు. ఇటీవల టీ20 ఫార్మాట్లో జరిగిన దేశవాళీ లీగ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఒకే మ్యాచ్‌లో 10 బంతుల్లో 37 రన్స్ కొట్టి, 3 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
దీంతోనే ఈ ఆల్ రౌండర్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్రశాంత్ వీర్‌ను కొనుగోలు చేసి రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేయాలని ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే మినీ వేలంలో ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడి మరీ ప్రశాంత్ వీర్ ను రూ.14.2 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది.
కార్తీక్ శర్మ బ్యాగ్రౌండ్:
కార్తీక్ శర్మ పవర్ హిట్టింగ్ చేయడంలో సమర్ధుడు. వికెట్ కీపర్ కావడం కూడా కలిసొచ్చింది. క్లీన్ స్ట్రైకింగ్, పవర్ ఫుల్ ఇన్నింగ్స్ ఆడుతూ రాజస్థాన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2006లో రాజస్థాన్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కార్తీక్ క్రికెట్ ప్రయాణం మొదట స్ట్రీట్ క్రికెట్‌లో ప్రారంభమై ఆ తర్వాత స్థానిక అకాడమీలో శిక్షణ తీసుకునే వరకు వెళ్ళింది. కోచ్‌లు అతని నైపుణ్యాన్ని గుర్తించి అతడి అభివృద్ధికి తోడ్పడ్డారు. తొలిసారి కార్తీక్ అండర్-14 క్రికెట్ లో రాజస్థాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
ఆ తర్వాత అండర్ -16 స్థాయిలో నిలకడగా రాణించి అద్భుత ఇన్నింగ్స్ లు ఆడాడు. మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీల నుండి పొందిన ప్రేరణ తనను ఎంతగానో ప్రభావితం చేసిందని తెలిపాడు. 19 ఏళ్ల వయసులోనే కార్తీక్ ప్రతిభకు గుర్తింపు లభించింది. డొమెస్టిక్ క్రికెట్ లో 12 టీ20 మ్యాచ్ ల్లో 164 స్ట్రైక్ రేట్‌తో 334 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. 2024-25 సీజన్‌లో ఉత్తరాఖండ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ అరంగేట్రంలో 113 పరుగులు చేసి సెంచరీతో సత్తా చాటాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో 9 మ్యాచ్‌ల్లో 445 పరుగులతో సత్తా చాటాడు.
