హైదరాబాద్ సిటీ, వెలుగు: రాజకీయాల్లో ఎన్నికల్లో గెలవడం కంటే చార్టర్డ్ అకౌంటెంట్ చేయడం కష్టమని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో చైర్‌పర్సన్ ఖుష్బూ దాగా నాయకత్వంలో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో రాఘవ్ చద్దాతో ‘ఇండియన్ పాలిటిక్స్ రీడిఫైన్డ్’అనే అంశంపై ప్రత్యేక ఇంటరాక్టివ్ సమావేశం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు వైఎఫ్‌ఎల్‌ఓ, ఎఫ్‌ఎల్‌ఓ సభ్యులు 450 మందికి పైగా హాజరయ్యారు.
ఖుష్బూ దాగాతో జరిగిన సంభాషణలో రాఘవ్ చద్దా తన రాజకీయ ప్రస్థానం, పాలన, యువత పాత్ర, ఏఐ, సోషల్ మీడియా, భారత భవిష్యత్తు వంటి అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘ఎన్నికల్లో గెలవడం కంటే చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేయడం చాలా కష్టం. నేను రాజకీయాలను ఎంచుకోలేదు.. రాజకీయాలే నన్ను ఎంచుకున్నాయి. హైదరాబాద్ తనకు ఎంతో ఇష్టమైన సిటీ. ఇక్కడికి రావడానికి ఎప్పుడూ కారణాలు వెతుక్కుంటాను”అని చెప్పారు.
గతంలో చమురుపై ఆధిపత్యం సాధించిన దేశాలు ప్రపంచ శక్తులుగా ఎదిగాయని, ఇప్పుడు ఆ స్థానాన్ని ఏఐ ఆక్రమిస్తోందని రాఘవ్ చద్దా అన్నారు. ఏఐ టెక్నాలజీని నియంత్రించే దేశాలే భవిష్యత్తును నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. భారత్ ఏఐ తయారీదారుగా కాకుండా ఏఐ వినియోగదారుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అత్యాధునిక ఏఐ చిప్‌లను అమెరికాకు చెందిన ఎన్విడియా రూపొందిస్తుండగా, వాటిలో ఎక్కువ భాగాన్ని తైవాన్‌కు చెందిన టీఎస్‌ఎంసీ తయారు చేస్తోందని, ప్రపంచ ఏఐ విప్లవాన్ని కొద్ది కంపెనీలే ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. దేశ పాలనలో యువతకు మరింత ప్రాధాన్యం కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.
