బీరు రేటు రూ.10 తగ్గింపు! 

బీరు రేటు రూ.10 తగ్గింపు! 

ఇయ్యాల ఉత్తర్వులు ఇవ్వనున్న సర్కార్   
సేల్స్, ఇన్ కమ్ తగ్గడంతో నిర్ణయం 
మద్యం అమ్మకాలు పెంచాలని అధికారులకు సీఎస్ ఆదేశం 

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో ఒక్కో బీర్ పై రూ.10 తగ్గనుంది. అన్ని రకాల బ్రాండ్లు, సైజ్‌ బీర్లకు ఇది వర్తించనుంది. ఈ మేరకు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సోమవారం రిలీజ్‌ చేయనుంది. ఆ వెంటనే కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. డిస్టిలరీల్లో ఉత్పత్తి చేసే బీర్లపై కొత్త ఎమ్మార్పీ రేట్లు వేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి. అయితే ఇప్పటికే లిక్కర్ షాప్స్ లో ఉన్న స్టాక్ ను మాత్రం పాత రేట్లకే అమ్మనున్నారు. కరోనా, లాక్ డౌన్ తో బీర్ల సేల్స్, ఆదాయం తగ్గడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 

రూ.30 పెంచి రూ.10 తగ్గింపు

కరోనా కారణంగా గతేడాది మేలో సెస్‌ పేరుతో ప్రభుత్వం లిక్కర్‌ రేట్లను పెంచింది. దాదాపు 20 శాతం ధరలు పెరిగాయి. దీంతో రూ.120 ఉన్న బీర్ రూ.150కి చేరింది. అదే టైమ్ లో ఇతర రాష్ట్రాల్లోనూ 10 నుంచి 15 శాతం లిక్కర్‌ రేట్లు పెంచారు. కానీ ఫస్ట్‌ వేవ్‌ లాక్‌డౌన్‌ ముగియడంతో ఆయా రాష్ట్రాలు సెస్‌ను ఎత్తేశాయి. ఢిల్లీ సర్కార్ కరోనా తగ్గకముందే ఎత్తేసింది. కానీ రాష్ట్ర సర్కార్ మాత్రం కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత స్వల్పంగా తగ్గించింది. అప్పుడు రూ.30 పెంచి, ఇప్పుడు రూ.10 మాత్రమే తగ్గించింది. 
బీర్ల సేల్స్ డౌన్.. 
కరోనాతో లిక్కర్‌‌ ఇన్​కమ్​పై ఎఫెక్ట్‌‌ పడింది. బీర్ల సేల్స్‌‌ భారీగా పడిపోయాయి. సాధారణంగా ఐఎంఎల్‌‌(ఇండియన్‌‌ మేడ్‌‌ లిక్కర్‌‌)తో పోలిస్తే బీర్ల అమ్మకాలే ఉంటాయి. ఎండాకాలంలో అయితే మరింత ఊపందుకుంటాయి. కానీ కరోనా కారణంగా ఏ సీజన్​లోనూ బీర్లు పెద్దగా అమ్ముడుపోలేదు. సేల్స్ దాదాపు సగానికి తగ్గాయి. 2019–20 ఫైనాన్షియల్ ఇయర్​లో 4.92 కోట్ల కేసుల బీర్లు అమ్ముడవ్వగా, 2020–21లో 2.73 కోట్ల కేసులు అమ్ముడయ్యాయి. రేట్లు భారీగా పెరగడం, కరోనా భయంతో జనం కూల్ వాటికి దూరంగా ఉండడంతో బీర్ల సేల్స్ తగ్గాయి. బీర్లు అమ్ముడుపోక సంగారెడ్డిలోని డిస్టిలరీలు కొన్ని రోజులు ఉత్పత్తి కూడా ఆపేశాయి. 
జూన్‌‌లో రూ.2,342 కోట్ల ఇన్ కమ్ 
రాష్ట్రంలో ఏ శాఖ ఆదాయం తగ్గినా ఎక్సైజ్‌‌ ఇన్‌‌కమ్ ​మాత్రం పెద్దగా తగ్గలేదు. లాక్‌‌డౌన్‌‌లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే వైన్స్ ఓపెన్ చేసినా లిక్కర్ సేల్స్ పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. మేలో రూ.2,129 కోట్ల లిక్కర్‌‌ సేల్‌‌ అయింది. ఇందులో 27 లక్షల కేసుల లిక్కర్‌‌, 20 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. ఇక లాక్‌‌డౌన్‌‌ ఎత్తేయడంతో సేల్స్‌‌ మరింత పెరిగాయి. జూన్‌‌లో రూ.2,342 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో 28.8 లక్షల కేసుల లిక్కర్‌‌, 26.8 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. కాగా, బీర్ల సేల్స్ పెంచడానికే సర్కార్ రేటు తగ్గించిందనే విమర్శలు వస్తున్నాయి. 
లిక్కర్ సేల్స్ పెంచండి: సీఎస్
మద్యం అమ్మకాలు కాస్త తగ్గడంతో సర్కార్ ఆదాయంపై ఎఫెక్ట్‌‌ పడింది. ప్రతినెల రూ. 2,500 నుంచి రూ. 2,700 కోట్ల లిక్కర్‌‌ సేల్స్‌‌ జరిగేవి. గత కొన్ని నెలలుగా ఆదాయం రూ.2,200 కోట్లకే పరిమితమవుతోంది. దీంతో అధికారులు, డిస్టిలరీల ప్రతినిధులతో సీఎస్ సోమేశ్ కుమార్ ఇటీవల రివ్యూ నిర్వహించారు. సేల్స్‌‌ బాగా తగ్గాయని, ఆదాయం పడిపోతోందని, మద్యం అమ్మకాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది. కస్టమర్లను ఆకర్షించేలా క్లబ్‌‌లు, బార్లు, పబ్‌‌ల నిర్వాహకులు సెట్టింగ్స్‌‌, లైటింగ్స్‌‌ ఏర్పాటు చేయాలని సూచించినట్లు సమాచారం. 
మద్యం అమ్మకాలు ఇలా  (కోట్ల కేసులు).. 
ఇయర్    బీర్లు    లిక్కర్‌‌
2019-20    4.92    3.48 
2020-21    2.73    3.35  
ప్రస్తుతం బీర్ల రేట్లు.. (రూ.లలో)
బ్రాండ్‌‌    లైట్‌‌(లెగర్‌‌)    స్ట్రాంగ్‌‌
బడ్వైజర్‌‌    210    -
రాయల్‌‌ చాలెంజ్‌‌    150    160
కింగ్‌‌ ఫిషర్‌‌    150    160
మినీ బీర్‌‌ (ఏదైనా)    100    110