పడిపోయిన బీర్ల సేల్స్.. కంపెనీలు బంద్​

పడిపోయిన బీర్ల సేల్స్.. కంపెనీలు బంద్​


సంగారెడ్డి, వెలుగు:  ఒకప్పుడు ఎర్రని ఎండల్లో సల్ల సల్లని బీరు తాగేందుకు మందుబాబులు పోటీపడేవారు. మరీ ఎండాకాలం నాలుగు నెలలైతే బీర్లకు ఎక్కడాలేని డిమాండ్​ఉండేది. కానీ కొవిడ్​ కారణంగా ఈ ఏడాది ఎండాకాలంలోనూ బీర్ల అమ్మకాలు పడిపోయాయి. దీంతో  సంగారెడ్డి జిల్లాలోని బీరు కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. అది ఏ స్థాయిలో అంటే నెలలో కనీసం 10 నుంచి 20 లక్షల  కేసుల చొప్పున ఉత్పత్తి చేసే ఒక్కో కంపెనీ, ఈసారి గరిష్ఠంగా 39 వేల కేసులకు మించి ప్రొడ్యూస్​చేయలేదు. ఈ క్రమంలో మేలో ఏకంగా మూడు కంపెనీలు తమ ప్రొడక్షన్​నిలిపివేశాయి. సంగారెడ్డి జిల్లాలో 6 బీరు తయారీ ఫ్యాక్టరీలు ఉన్నాయి.  కొండాపూర్ మండలంలో 4, సంగారెడ్డి, పుల్కల్ మండలాల్లో ఒక్కోటి నడుస్తున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే బీరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, అప్పుడప్పుడు గోవాకు కూడా కూడా సప్లై చేస్తుంటారు. అయితే ప్రస్తుతం బీర్లకు డిమాండ్​ పడిపోవడంతో మూడు కంపెనీలు అరకొరగా ఉత్పత్తి చేస్తుండగా, మిగిలిన మూడు ఫ్యాక్టరీలు  కొండాపూర్ మండలం మల్లెపల్లిలోని కాల్స్ బర్గ్, యుబి నిజాం (యునైటెడ్ బ్రేవరీస్), పుల్కల్ మండలం శివంపేటలో ఉన్న చార్మినార్ కంపెనీలు మే నెలలో బీర్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపేశాయి.
పదో వంతు కూడా ఉత్పత్తి చేయలే..
కొండాపూర్ మండలంలోని కజురహో, బడ్ వైజర్ కంపెనీలు గతేడాది వేసవిలో నెలకు 20 లక్షల  కేసుల చొప్పున బీరు ఉత్పత్తి చేయగా, ఈసారి కజురహో కంపెనీ నెలకు 10 వేల కేసులు, బడ్ వైజర్ కంపెనీ 39 వేల కేసులు మాత్రమే ఉత్పత్తి మాత్రమే చేశాయి. బడ్ వైజర్ కంపెనీ 39 వేల కేసుల్లో కేవలం 5,380 కేసుల బీరు మాత్రమే విక్రయించింది. ఇక యూబీ నెలకు నాలుగున్నర వేల కేసుల బీరు ప్రొడక్షన్ చేస్తోంది. మల్లేపల్లిలోని కాల్స్ బార్గ్ ఫ్యాక్టరీ నెలరోజులుగా ప్రొడక్షన్ బంద్ పెట్టి తాజాగా మంగళవారం స్టార్ట్ చేసినట్టు ఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపింది. ఇకపోతే కోత్లాపూర్ యూబీ నిజాం కంపెనీ గతంలో 10 లక్షల కేసులు ఉత్పత్తి చేయగా, ఈసారి మే నెలలో ప్రొడక్షన్ ఆపేశారు.  పుల్కల్ మండలం శివంపేటలో ఉన్న చార్మినార్ కంపెనీ గత ఎండాకాలంలో నెలకు 14 లక్షల కేసుల బీరు ప్రొడక్షన్ చేయగా, ఈసారి  మే నెల 4 నుంచి ప్రొడక్షన్ పూర్తిగా బంద్​పెట్టింది.