- ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలి
- సీఎంను కోరిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
రవీంద్రభారతి, వెలుగు: జనగామ జిల్లాకు దొడ్డి కొమురయ్య పేరును పెట్టాలని, అక్కడ నిర్మించనున్న విమానాశ్రయానికి కూడా ఆయన పేరును పెట్టాలని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం దొడ్డి కొమురయ్య 99వ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, విప్ బీర్ల ఐలయ్య ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కొమురయ్య ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బీర్ల ఐలయ్య మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరామని, వచ్చే జయంతి నాటికి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. కొమురయ్య పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కురుమల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ద్వారా కోట్లాది రూపాయల పనులు చేపడతానని హామీ ఇచ్చారు.
రాజకీయాల్లో కురుమల ప్రాతినిధ్యం పెరిగితేనే సమాజ అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ వెట్టిచాకిరి, అసమానతలు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు దొడ్డి కొమురయ్య అని అన్నారు. రజాకార్ల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొని తెలంగాణ గడ్డ కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.
కురుమల రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలని, వచ్చే ఎన్నికల్లో కనీసం 10 మంది ఎమ్మెల్యేలు గెలవాలని ఆకాంక్షించారు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ బీసీల్లో చైతన్యం పెరిగిందన్నారు. బీసీలు ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ క్యామ మల్లేశ్, బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బాలమయాదేవి, ఉత్సవ కమిటీ చైర్మన్ కమలాకర్, సభ్యులు ఏలేందర్, దొడ్డి కొమురయ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
