
పాల నుంచి టీ పొడి దాకా.. కర్రీపాయింట్లలోని కూరల నుంచి వంటల్లో వాడే దినుసుల దాకా.. అన్నీ కల్తీమయమే! కల్తీల నిరోధానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా అడ్డుకట్ట పడడం లేదు. రాష్ట్రంలో ఆహార కల్తీ కేసులు ఏటేటా పెరిగిపోతున్నాయి. పాల నుంచి ప్రతి నిత్యావసర వస్తువులు కల్తీ బారిన పడుతున్నాయి. కల్తీల్లో టీ పొడి మొదటి స్థానంలో ఉంది. రాష్ర్టంలో 2014 నుంచి ఆహార కల్తీ కేసుల సంఖ్య పెరుగుతోందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాం డర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్ ఎస్ ఏఐ) వెల్లడించింది. గత ఐదేళ్లలో సేకరించిన శాంపిళ్లను పరీక్షించి రూపొందించిన రిపోర్ట్‌ను ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు సమర్పించింది. 2014లో 222 శాంపిళ్లను పరీక్షించగా వాటిలో 4 మాత్రమే హానికరమైనవని గుర్తించింది. 2015లో 116 శాంపిళ్లు, 2016లో 286, 2017లో 330 శాంపిళ్లు హానికరమైనవిగా తేలాయి. గతేడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 2,519 శాంపిళ్లను టెస్ట్ చేయగా 598 శాంపిళ్లలో నాణ్యత ప్రమాణాలు లేనట్లు గుర్తించారు.
వందలాది శాంపిళ్లు.. ఒక్కరే సైంటిస్ట్
2017లో సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి నమోదు చేసిన వందలాది కల్తీ కేసులు ఇంకా తేలనేలేదు. వీటిలో 20 శాతం కేసులకు సంబంధించిన శాంపిళ్ల టెస్ట్‌లు కూడా పూర్తి కాలేదు. దీంతో ఆయా స్టేషన్లకు చెందిన కానిస్టేబుళ్లు రిపోర్టుల కోసం నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ చుట్టూ రోజూ తిరుగుతున్నారు. పోలీసులు పంపిన వాటిని ప్రైవేట్ శాంపిళ్ల కింద ట్రీట్ చేయడమేగాక, వందలాదిగా ఉన్న ఈ శాంపిళ్లను టెస్ట్ చేయడానికి ఒక్క జూనియర్ సైంటిస్ట్‌నే కేటాయించారు.
ఏపీవి కూడా ఇక్కడికే..
ఆంధ్రప్రదేశ్ కు చెందిన శాంపిళ్లను కూడా నాచారం ల్యాబ్ లోనే టెస్ట్ చేస్తున్నారు. 2018లో టెస్ట్ చేసిన 4,792 శాంపిళ్లలో 3,523 ఆ రాష్ట్రానికి చెందినవే కావడం గమనార్హం. ఫుడ్ ల్యాబొరేటరీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతోపాటు ఏపీకి గతంలో రూ.9 కోట్లు విడుదల చేసినా అక్కడి ప్రభుత్వం వినియోగించుకోలేదని తెలిసింది. రాష్ట్రంలోని అన్ని డిపార్ట్‌మెంట్ ల్లాగే ఫుడ్ ల్యాబొరేటరీని కూడా త్వరగా విభజిస్తే సిబ్బందిపై పని భారం తగ్గే అవకాశముందని ఆ సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు.
సిబ్బంది కొరతతో ఇబ్బంది
ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరతతో క్షేత్రస్థాయిలో తనిఖీలు మందకొడిగా జరుగుతున్నాయి. మొత్తం 33 జిల్లాలకు కలిపి జిల్లాకు ఇద్దరు ఫుడ్ ఇన్ స్పెక్టర్లు , ఒక గెజిటెడ్ ఫుడ్ ఇన్ స్పెక్టర్ చొప్పున మొత్తం 99 మంది సిబ్బంది ఉండాలి. కానీ ప్రస్తుతం 13 మంది ఫుడ్ ఇన్ స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. వాస్తవానికి ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ట్రంలో సుమారు 400 మంది అధికారులు ఉండాలి. హైదరాబాద్ లోనే 160 మంది ఆహార పర్యవేక్షకులు అవసరం. కానీ ప్రభుత్వం కొన్నేళ్లుగానియామకాలు చేపట్టడం లేదు. కల్తీకి పాల్పడితే కఠిన శిక్షే సరుకుల కల్తీని అరికట్టేందుకు కేంద్రం 2006లో ఆహార పరిరక్షణ, ప్రమాణాల చట్టం తీసుకొచ్చింది. దీన్ని 2013 నుంచి తప్పనిసరి చేశారు. కల్తీకి పాల్పడే వారిపై ఈ చట్టాల కింద కేసులు నమోదు చేస్తారు. కల్తీ జరిగినట్లు తేలితే నిందితులకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా, కనీసం ఆరు నెలల నుంచి గరిష్టంగా ఐదేండ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. కల్తీ ఆహారంతో మనిషి చనిపోయినట్లు రుజువైతే బాధ్యులకు జీవిత ఖైదు విధించవచ్చు.
బేగం బజార్, సికింద్రాబాద్ నుంచే
రాష్ట్రంలో అత్యధికంగా కల్తీ అవుతున్న నిత్యావసరాల జాబితాలో టీ పొడి మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో కర్రీ పాయింట్లలోని కూరలు, ఊరూపేరూ లేని ప్యాకెట్ ఫుడ్స్, బిర్యానీ, పాలు, కంది పప్పు, ఆవాలు, గసగసాలు, జీలకర్ర, ఆలయ పరిసరాల్లో అమ్మే తినుబండారాలు ఉన్నాయి. వీటిలో కందిపప్పు, జీలకర్ర, గసగసాలు, ప్యాకెట్ ఫుడ్స్ హైదరాబాద్ లోని బేగం బజార్, సికింద్రాబాద్ లోని కార్ఖానా ప్రాంతాల నుంచే పల్లెలకు తరలివెళ్తున్నాయి. రెండేళ్ల క్రితం కొన్ని హోల్ సేల్ దుకాణాలపై పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేసినా ఈ దందా మాత్రం ఆగలేదు. మళ్లీ యథేచ్చగా కొనసాగుతున్నట్లు తెలిసింది. కల్తీ సరుకుల విక్రయం హైదరాబాద్ నగరంలో తక్కువేనని, గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాలు, ఏజెన్సీ ఏరియాల్లోని సంతలు, జాతరల్లో ఎక్కువగా లభిస్తున్నాయని ఫుడ్ సేఫ్టీ విభాగంలోని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.