జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అలాంటివారి కోసం ఫీల్ ది జైల్ మ్యూజియం ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. సోమవారం చంచల్ గూడా జైలులో ఫీల్ ది జైల్ మ్యూజియంను ప్రారంభించారు గవర్నర్ ప్రతాప్ శుక్లా. ఈ కార్యక్రమ ద్వారా 24 గంటలు జైలులో గడపాలనుకునే వారికీ అవకాశం కల్పిస్తున్నారు. రూ. 1000 చెల్లిస్తే 12 గంటలు, రూ. 2 వేలు చెల్లిస్తే 24 గంటలు జైలులో ఉండే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు అధికారులు. ఈ సందర్భంగా జైలు డీజీ సౌమ్య మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫీల్ ది జైల్ ద్వారా నిజమైన జైలు జీవితం అనుభవించే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు.
జైలు అంటే శిక్ష స్థలం మాత్రమే కాదని.. సంస్కరణ కేంద్రం కూడా అని అన్నారు. జైళ్ల చరిత్ర, ఖైదీల జీవితం ప్రజలకు తెలియజేయడమే మ్యూజియం లక్ష్యం అని అన్నారు డీజీ సౌమ్య. ఈ కార్యక్రమం ఖైదీల క్రమశిక్షణ, జీవన విధానాన్ని ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం అని అన్నారు డీజీ సౌమ్య. యోగా, ధ్యానం, విద్యతో ఖైదీల్లో సానుకూల మార్పులు వస్తాయని.. విడుదల తర్వాత స్వయం ఉపాధి కోసం వృత్తి శిక్షణలు కూడా ఇస్తున్నామని అన్నారు.
ఖైదీల పెయింటింగ్స్‌లో పశ్చాత్తాపం, కొత్త జీవితంపై ఆశ ప్రతిబింబిస్తాయని.. డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా మాదకద్రవ్యాల బానిసత్వానికి చికిత్స అందిస్తున్నామని అన్నారు సౌమ్య. శిక్ష తప్పును గుర్తు చేస్తుందని.. సంస్కరణ జీవితాన్ని మార్చుతుందని అన్నారు డీజీ సౌమ్య.
