- పూర్తయిన సర్వే, మూడేండ్ల కిందటే అనుమతులు
- ముడి ఇనుము రవాణా, మైనింగ్‌కు అనుకూలం
కోల్‌బెల్ట్/ఆసిఫాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం భారత్ మాల స్కీమ్‌లో భాగంగా మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి వరకు నిర్మించనున్న నాలుగు లేన్ల రహదారిపై ఆశలు రేకెత్తుతున్నాయి. బెల్లంపల్లి–-గడ్చిరోలి గ్రీన్ఫీల్డ్ ఫోర్ లేన్ హైవేను మంచిర్యాల జిల్లా తాండూర్ నుంచి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా వరకు 63.2 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు.
ఈ రహదారి ఏర్పాటుకు మూడేండ్ల కింద అనుమతులు రాగా, ఇప్పటికే తెలంగాణ, మహారాష్ట్రలో ప్రాథమిక సర్వే కూడా పూర్తి చేశారు. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని 8 మండలాలను కలుపుతూ రహదారి వెళ్లనుంది. రోడ్డు నిర్మాణానికి సుమారు 1,200 ఎకరాల భూమి సేకరించనున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడంతో గ్రీన్ఫీల్డ్ హైవేపై ఆశలు చిగురిస్తున్నాయి.
మూడేండ్ల కిందే అనుమతులు
కేంద్ర ప్రభుత్వం భారత్ మాల స్కీమ్‌లో భాగంగా మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి వరకు హైవే నిర్మాణానికి మూడేండ్ల కింద అనుమతులు ఇచ్చింది. భూసేకరణ కోసం మొదట మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక సర్వే పూర్తి చేయగా, 2023లో తెలంగాణ ప్రభుత్వం కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో సర్వే చేపట్టింది. కాగజ్‌నగర్ మండలం మోసం, సిర్పూర్(టి) మండలం చింతకుంట, పెద్దబండ, లక్ష్మీపూర్ సమీపంలోని ఫారెస్ట్ గుండా సర్వే చేపట్టగా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అనుమతులు రాక పనులు నిలిపేశారు.
8 మండలాల మీదుగా..
మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని 8 మండలాల మీదుగా హైవేను నిర్మించనున్నారు. తాండూరు మండలం అన్నారం, గంపాలపల్లి, అచ్చలాపూర్, చంద్రపెల్లి, రాంపూర్, కత్తెర్ల, ద్వారకాపూర్, బోయపల్లి, కాసీపేట, మదనాపూర్ మీదుగా బెల్లంపల్లి మండలం చాకెపల్లి, అంకుసం, భీమిని మండలం కేస్లాపూర్, కొత్తగూడ, లక్ష్మీపూర్, కమలాపూర్, పోతెపల్లిని కలుపుతూ రోడ్డు వేయనున్నారు.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలం జక్కపల్లి, దహేగాం మండలం రాళ్లగూడ, జెండాగూడ, ఇటిక్యాల, బోర్లకుంట, కాగజ్‌నగర్ మండలం అనుకొడ, మండువా, గన్నారం, మోసం, నాగంపేట, రాస్పెల్లి, జంబుగ, సిర్పూర్(టి) మండలం లోనవెల్లి, పారిగాం, టోంకిని, లక్ష్మీపూర్, వెంకట్రావుపేట, హీరాపూర్, చింతకుంట, ఆరెపల్లి, చుంచుపెల్లి, కౌటల మండలం కుంభారీ, సాండ్‌గాం, కౌటి, పార్డీ గ్రామాల మీదుగా హైవే వెళ్తుంది.
వీరవెల్లి గ్రామానికి సరిహద్దున ప్రవహిస్తున్న వార్ధా నది మీదుగా మహారాష్ట్రలోని కిర్మిరి గ్రామం నుంచి గడ్చిరోలి వెళ్లే హైవేకు ఈ ఫోర్‌లేన్‌ను అనుసంధానం చేయనున్నారు. మహారాష్ట్రలోని దాబా, ఘాట్, చామెర్షి, గోవింద్పూర్ మీదుగా గడ్చిరోలి జిల్లా వరకు రహదారి నిర్మిస్తారు. గ్రీన్ఫీల్డ్ హైవే పనులు కోసం రెండు జిల్లాల పరిధిలోని 8 మండలాల్లో 1200 ఎకరాల వరకు భూమి సేకరించనున్నారు.
బిజినెస్ ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ ప్రక్రియలో భాగంగా మూడేండ్ల కింద కాగజ్‌నగర్, సిర్పూర్(టి), కౌటాల మండలాల్లో ఆఫీసర్లు సర్వే చేశారు. బీపీఆర్ తయారైన వెంటనే భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేయడానికి అప్పటి కాగజ్ నగర్ ఆర్డీవోకు బాధ్యతలు అప్పగించారు.
మూడు రాష్ట్రాల్లో మెరుగుపడనున్న రవాణా వ్యవస్థ
హైవే నిర్మాణంతో తెలంగాణ,-మహారాష్ట్ర మధ్య బంధాలు మరింత బలపడనున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కలిపే కారిడార్‌గా మారనుంది. రెండు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికే వ్యాపార, వ్యాణిజ్య, వస్తుమార్పిడిలో చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. తాజాగా గడ్చిరోలి జిల్లా సూర్జాగఢ్‌లో ముడి ఇనుము ఫ్యాక్టరీ, మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభం కాగా, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు రాకపోకలు జరుగుతున్నాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్య తొలిగి రవాణా వ్యవస్థ మరింత సులభతరం కానుంది.
ఈ హైవే పనులు చేపట్టాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి స్థానిక ప్రజాప్రతినిధులు పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. తాజాగా సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబు కేంద్ర మంత్రికి వినతిపత్రం అందించగా, ఆయన సుముఖత వ్యక్తం చేయడంతో రెండు జిల్లాల వాసుల్లో ఆశలు రేకేత్తుతున్నాయి.
