- ఊహించని విధంగా ఎస్‌టీటీ పెంపుతో షాక్
- అధికంగా నష్టపోయిన బ్రోకరేజ్ కంపెనీల షేర్లు
- ఐటీ మినహా అన్ని సెక్టార్ల ఇండెక్స్‌లు నష్టాల్లోనే..
- కుప్పకూలిన ప్రభుత్వ బ్యాంకుల షేర్లు
- వాటి పనితీరుపై కమిటీ వేస్తామనడమే కారణం
- ఎంసీఎక్స్‌లో పడిన గోల్డ్, సిల్వర్ ధరలు
ముంబై: బడ్జెట్ ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయింది. విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించే చర్యలు పెద్దగా లేకపోగా ఫ్యూచర్స్, ఆప్షన్స్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్‌టీటీ) ని పెంచడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ ఆదివారం కుప్పకూలాయి. ఇన్వెస్టర్లు ఒక్క రోజే రూ.10 లక్షల కోట్లు నష్టపోయారు. బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 450 లక్షల కోట్లకు తగ్గింది. సెన్సెక్స్ -ఆదివారం 1,547 పాయింట్లు (1.88 శాతం) పతనమై 80,722.94 వద్ద ముగియగా, నిఫ్టీ 495.20 పాయింట్లు (-1.96శాతం) తగ్గి 24,825.45 వద్ద సెటిలయ్యింది. ఒక్క ఐటీ మినహా అన్ని సెక్టార్ల ఇండెక్స్‌లు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంక్ షేర్లు భారీగా పడ్డాయి. బ్యాంకుల పనితీరును పరిశీలించేందుకు హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో ప్రతిపాదించడమే ఇందుకు కారణం. లాంగ్‌టెర్మ్‌లో బ్యాంకులకు ప్రయోజనం ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కి మొగ్గు చూపారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్ షేర్లు 8 శాతం వరకు నష్టపోయాయి. వెండి, బంగారం ధరలు ఎంసీఎక్స్‌లో పడడం, మార్కెట్ నెగెటివ్‌లో కదలడంతో మెటల్ షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్‌లో ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, బీఈఎల్, ఐటీసీ, టాటా స్టీల్ షేర్లు నాలుగు నుంచి ఆరు శాతం వరకు పడగా, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ కొద్ది పాటి లాభాలతో ముగిశాయి.
బై బ్యాక్ ట్యాక్స్ సవరణతో లాభాల్లో..
నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మాత్రం 0.57 శాతం పెరిగింది. బడ్జెట్‌లో షేర్ బై బ్యాక్‌కి సంబంధించి ఒక రూల్‌ను మార్చారు. షేర్ హోల్డర్లకు బై బ్యాక్ కింద షేర్లు అమ్మడంతో వచ్చే లాభాలను ఇప్పటి వరకు ఆదాయంగా చూసేవారు. ఇక నుంచి దీనిని క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణిస్తారు. దీంతో మైనార్టీ షేర్ హోల్డర్లు ఇన్‌కమ్ ట్యాక్స్‌కు బదులు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (ఎల్‌సీజీటీ) 12.5 శాతం కడితే సరిపోతుంది. కార్పొరేట్ ప్రమోటర్లు, నాన్ కార్పొరేట్ ప్రమోటర్ల ఎల్‌సీజీటీతో పాటు బై బ్యాక్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ ట్యాక్స్ సవరణలతో ఐటీ షేర్లు మార్కెట్ మూడ్‌ను తట్టుకోగలిగాయి.
బ్రోకరేజ్ కంపెనీలు ఢమాల్..
బడ్జెట్‌లో ఎస్‌టీటీ పెంచడంతో బ్రోకరేజ్, స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీల షేర్లు భారీగా పడ్డాయి. బీఎస్‌ఈ లిమిటెడ్ షేర్లు 8శాతం పడగా, ఏంజెల్ వన్ 8.6 శాతం క్రాష్ అయ్యింది. మోతీలాల్ ఓస్వాల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్‌ఎల్ షేర్లు 5–7 శాతం వరకు, మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ క్యామ్స్ షేర్లు 4 శాతం వరకు పడ్డాయి. ఎస్‌టీటీ పెరగడంతో ట్రేడింగ్ వాల్యూమ్స్ పడిపోతాయని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. “ఈ బడ్జెట్ చాలా చాలా సానుకూలంగా ఉంది. ఇందులో అనేక కీలక ప్రకటనలు ఉన్నాయి. ముఖ్యంగా 2047 వరకు డేటా సెంటర్లలో విదేశీ పెట్టుబడులకు పన్ను మినహాయింపులు ఇవ్వడం లాంగ్‌టర్మ్ క్లారిటీని ఇస్తోంది. వ్యాపారం చేయడాన్ని సులభతరం చేసే ప్రకటనలు ఉన్నాయి” అని ప్రభుదాస్ లీలాధర్ (పీఎల్) క్యాపిటల్ చైర్‌పర్సన్ అమిషా వోరా అన్నారు. “ఈ బడ్జెట్‌లో ఉన్న ఒకే ఒక్క నెగెటివ్ అంశం డెరివేటివ్స్‌పై ఎస్‌టీటీ పెంచడమే. దీనికి మార్కెట్ వెంటనే స్పందించింది. ఈ బడ్జెట్ వృద్ధికి అనుకూలంగా ఉంది. ఇన్వెస్ట్ చేయాలని సలహా ఇస్తున్నాం ” అని వోరా అన్నారు.
ఎనలిస్టులు ఏమంటున్నారంటే?
1) ‘‘ఈ బడ్జెట్ చాలా బాగుందని అనలేం. కానీ ప్రస్తుత పరిస్థితులను మేనేజ్ చేసేందు కు ప్రభుత్వం వాస్తవిక కోణంలో చర్యలు తీసుకుంది”అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ మేనేజింగ్ డైరెక్టర్ ధీరజ్ రెల్లీ అన్నారు. డెరివేటివ్స్‌పై ఎస్‌టీటీ పెంచడంతో ఇప్పుడు ప్రతికూలత కనిపించినా, లాంగ్‌టెర్మ్‌లో మార్కెట్ స్థిరంగా ఉంటుందన్నారు.
2) ఇది స్థిరమైన, ఆర్థిక క్రమశిక్షణతో కూడిన బడ్జెట్ అని యెస్ సెక్యూరిటీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్ అంబానీ పేర్కొన్నారు. ఆర్థిక లోటు లక్ష్యాలను చేరుకున్నామని, ప్రభుత్వ మూలధన వ్యయాన్ని అధిక స్థాయిలో కొనసాగించిం దని తెలిపారు. ‘‘మార్కెట్ అప్పులను నియంత్రించడంపై బడ్జెట్ ఫోకస్ పెట్టింది. నామినల్ జీడీపీ వృద్ధి అంచనాలను సుమారు 10శాతం వద్ద ఉంచింది. ఎస్‌టీటీ పెంచుతారని ఊహించకపోవడంతో మార్కెట్ పడింది”అని అమర్ వివరించారు.
