"ఇది బుల్డోజర్ల రాష్ట్రం కాదు".. బెంగాల్ హింసపై కోర్టుకెక్కిన మమతా బెనర్జీ..

"ఇది బుల్డోజర్ల రాష్ట్రం కాదు".. బెంగాల్ హింసపై కోర్టుకెక్కిన మమతా బెనర్జీ..

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ గురువారం కలకత్తా హైకోర్టులో స్వయంగా హాజరయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసపై వేసిన పిటిషన్ (PIL) విచారణ సందర్భంగా ఆమె కోర్టుకెక్కారు. 1982లో లా (న్యాయశాస్త్రం) చదివిన మమత, చాలా ఏళ్ల తర్వాత మళ్లీ న్యాయవాది కోటు వేసుకుని ఆమె పార్టీ కార్యకర్తల తరపున వాదించారు.

 కోర్టులో ఏమన్నారంటే?
"దయచేసి బెంగాల్ ప్రజలను కాపాడండి. ఇది బుల్డోజర్లతో పాలించే రాష్ట్రం కాదు. ఇక్కడ చట్టం అమలు కావాలి" అని ఆమె ప్రధాన న్యాయమూర్తిని కోరారు.  దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, కనీసం కేసులు (FIR) కూడా రిజిస్టర్ చేయడం లేదని ఆమె ఆరోపించారు. "పోలీసుల ముందే ఇళ్లను, ఆఫీసులను లూటీ చేస్తున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు.

"చనిపోయిన పది మందిలో ఆరుగురు హిందువులే ఉన్నారు. నా కుటుంబంలోని చిన్న పిల్లలను (12 ఏళ్ల బాలికలు) అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు. చేపల మార్కెట్లను కూడా ధ్వంసం చేస్తున్నారు" అని మమత కోర్టుకు తెలిపారు.

అసలు ఏం జరిగిందంటే 
ఇటీవల జరిగిన 2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భారీ మార్పు వచ్చింది. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రాగా, టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది.

►ALSO READ | కేరళ సీఎంగా వి.డి. సతీసన్: స్టూడెంట్ లీడర్ నుంచి సీఎం కుర్చీ వరకు!

ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ కార్యకర్తలపై, పార్టీ ఆఫీసులపై దాడులు జరుగుతున్నాయని, మా కార్యకర్తలను  చంపేస్తున్నారని టీఎంసీ ఆరోపిస్తోంది. అందుకే పార్టీ కార్యకర్తలకు రక్షణ కల్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది.

"హైకోర్టులో నేను హాజరు కావడం ఇదే మొదటిసారి. ఒక లాయర్‌గా నా వాదనలు వినిపిస్తున్నాను" అని ఆమె న్యాయమూర్తులకు చెప్పారు. ఓట్ల లెక్కింపులో తేడాలు ఉన్నచోట కొత్త పిటిషన్లు వేయాలని అంతకుముందు సుప్రీంకోర్టు ఆమెకు సూచించింది. మమత కోర్టుకు వెళ్లడంపై బీజేపీ ఎమ్మెల్యే సజల్ ఘోష్ స్పందిస్తూ.. "కోర్టుకు వెళ్లడం ఆమె హక్కు, కానీ ఇప్పుడు ఆమె అక్కడ ఏం చేస్తుంది?" అని ఎద్దేవా చేశారు.