ఇలా కూడా చనిపోతారా..? ఓటర్ లిస్ట్‎లో పేరు తొలగిస్తారేమోనని భయంతో వ్యక్తి ఆత్మహత్య

ఇలా కూడా చనిపోతారా..? ఓటర్ లిస్ట్‎లో పేరు తొలగిస్తారేమోనని భయంతో వ్యక్తి ఆత్మహత్య

కోల్‎కతా: ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, లవ్ ఫెల్యూర్, జీవితంపై విరక్త రావడం వంటి సమస్యలతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. చిన్న చిన్న సమస్యలను కూడా ఎదుర్కొలేక క్షణికావేశంలో విలువైన ప్రాణాలు పొగుట్టుకుంటారు.. ఇప్పటి వరకు మనం ఎక్కువగా ఇలాంటి తరహా సూసైడ్ ఘటనలే చూశాం. కానీ బెంగాల్‎లో మాత్రం షాకింగ్ సూసైడ్ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. ఓటర్ లిస్ట్‎లో పేరు తొలగిస్తారేమోనని భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చూసిన తర్వాత.. అతడు చనిపోయాడని బాధ పడాలో.. లేక అసలు ఇలాంటి కారణానికి ఎవరైనా చనిపోతారా అని కోప్పడాలో అర్థం కానీ పరిస్థితి. 

వెస్ట్ బెంగాల్‎లో నకిలీ ఓట్ల తొలగింపులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ చేపడుతుంది. రాబోయే బెంగాల్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సన్నాహకంగా 2025, నవంబర్‎లో ఈసీ సర్ ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ క్రమంలో తన దగ్గర సరైన గుర్తింపు పత్రాలు లేకపోవడంతో ఓటర్ లిస్ట్ నుంచి తన పేరు తొలగిస్తారేమోననే భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఉత్తర 24 పరగణాల జిల్లా ఘుషిఘాటాలో నివసించే సఫికుల్ గాజీ గత కొన్ని నెలలుగా భంగర్‌లోని జైపూర్‌లో తన అత్తమామలతో నివసిస్తున్నాడు. కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడినప్పటి నుంచి గాజీ మానసికంగా బాధపడుతున్నాడు. ఎన్నికల సంఘం బెంగాల్‎లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ చేపడతామని ప్రకటించినప్పుటి నుంచి మరింత ఆందోళనకు గురవుతున్నాడు. తన దగ్గర సరైన పత్రాలు లేకపోవడంతో అధికారులు ఓటర్ లిస్ట్ నుంచి తన పేరు తొలగించి దేశం నుంచి వెళ్లగొడతారేమోనని తీవ్రంగా భయపడుతున్నాడు. ఈ భయంతోనే మంగళవారం (నవంబర్ 4) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డానని కుటుంబ సభ్యులు ఆరోపించారు. 

సఫికుల్ గాజీ మరణం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ఘటనను లక్ష్యంగా చేసుకుని బీజేపీపై అధికార తృణమాల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. సర్ ప్రక్రియపై భయం కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎనిమిది మంది మరణించారని విమర్శించింది. పేద ప్రజలను బెదిరించి వారి ఓటు హక్కును తొలగించాలనే బీజేపీ కుట్ర వల్లే ఇలా జరుగుతోందని ఆరోపించింది. రాజకీయ ప్రయోజనాల కోసం టీఎంసీ మరణాలను ఉపయోగించుకుంటోందని బీజేపీ రివర్స్ కౌంటర్ ఇచ్చింది.