
బెంగళూరు: బెంగళూరులోని శివాజీనగర్‌లో త్వరలో ప్రారంభం కానున్న మెట్రో స్టేషన్‌కు సెయింట్ మేరీ పేరు పెట్టాలన్న కర్నాటక ప్రభుత్వ నిర్ణయంపై పలువురు మండిపడుతున్నారు. బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగానే సీఎం సిద్ధ రామయ్య ఈ నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
స్టేషన్ పేరు మార్పు చేయడం అంటే మరాఠా ఐకాన్ శివాజీ మహారాజ్‌ను అవమానించడమేనని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. సిద్ధరామయ్యకు మంచి బుద్ధి ప్రసాదించాలని తాను ప్రార్థిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. శివాజీనగర్‌లోని సెయింట్ మేరీస్ బసిలికాలో ఇటీవల మాట్లాడిన సిద్ధరామయ్య.. మెట్రో స్టేషన్‌కు సెయింట్ మేరీ పేరు పెట్టాలని కేంద్రానికి సిఫార్సు చేసినట్లు చెప్పారు.
ఈ ప్రకటనతో కర్నాటక బీజేపీ నాయకులతో పాటు మహారాష్ట్ర బీజేపీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ‘‘మెట్రో స్టేషన్ పేరు మార్పుపై కర్నాటక ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నాను. ఇది ఛత్రపతిని అవమానపర్చడమే. నెహ్రూ కాలం నుంచి ఇప్పటివరకు శివాజీని కాంగ్రెస్ అవమానిస్తూనే ఉంది” అని బీజేపీ మండిపడింది.