ఇంత శాడిస్టుగా ఉన్నావేంట్రా: ఆటో ఢీకొని మహిళ మృతి.. బాడీని చెత్తకుండీలో పడేసి వెళ్లిపోయిన డ్రైవర్..!

ఇంత శాడిస్టుగా ఉన్నావేంట్రా: ఆటో ఢీకొని మహిళ మృతి.. బాడీని చెత్తకుండీలో పడేసి వెళ్లిపోయిన డ్రైవర్..!

మనిషిలో మానవత్వం మంటగలిసిపోతోందనడానికి ఈ ఘటనే నిదర్శనం. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడాల్సింది పోయి.. ఆమె మరణించిందని తెలిసి భయంతో ఆ మృతదేహాన్ని చెత్తకుండీలో పడేసిన ఓ ఆటో డ్రైవర్ ఉదంతం ఇప్పుడు బెంగళూరులో కలకలం రేపుతోంది. ఈ అమానుషానికి ఒడిగట్టిన నిందితుడిని పోలీసులు గురువారం (మార్చి 26) అరెస్ట్ చేశారు.

నాలుగు రోజులు క్రితం కెంగేరి శాటిలైట్ టౌన్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఓ మహిళ మృతిచెందిన ఘటనలో బెంగళూరులోని లగ్గెరి కి చెందిన ఓ ఆటో డ్రైవర్ ను  గురువారం (మార్చి26) )అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారించగా సంచలన విషయాలు బయటికొచ్చాయి. 

కెంపమ్మ రోడ్డు దాటుతుండగా బసవేగౌడ నడుపుతున్న ఆటో ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. మొదట మానవత్వంతో స్పందించిన డ్రైవర్, ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు తన ఆటోలో ఎక్కించుకున్నాడు.అయితే, ఆసుపత్రికి వెళ్లే మార్గమధ్యంలోనే కెంపమ్మ తీవ్ర రక్తస్రావం కారణంగా ప్రాణాలు విడిచింది. ఆమె చనిపోయిందని గ్రహించిన బసవేగౌడ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. పోలీసులకు దొరికిపోతాననే భయంతో, ఆసుపత్రికి వెళ్లకుండా ఆటోను దారి మళ్లించాడు. నిర్జన ప్రదేశం కోసం వెతికి, చివరకు రోడ్డు పక్కన ఉన్న ఒక చెత్తకుప్పలో ఆమె మృతదేహాన్ని పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

రోడ్డు పక్కన మృతదేహం లభించడంతో రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్ జగదీష్ నేతృత్వంలోని పోలీసు బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను, టెక్నాలజీని విశ్లేషించగా అసలు విషయం బయటపడింది. ఆటో నంబర్ ఆధారంగా నిందితుడు బసవేగౌడను గుర్తించి గురువారం కటకటాల వెనక్కి నెట్టారు.