బెంగళూరు నగరంలో జరిగిన సినిమా రేంజ్ దొంగతనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బుధవారం మధ్యాహ్నం జయనగర్‌లో ఇది చోటుచేసుకుంది. రిజర్వు బ్యాంక్ అధికారులం అంటూ 5-6 దుండగులు మధ్యాహ్నం CMS ఇన్ఫో సిస్టమ్స్‌కు చెందిన క్యాష్ వాన్‌ను టార్గెట్ చేసి రూ.7 కోట్లు లూటీ చేశారు. వాన్ HDFC బ్యాంక్ సొమ్మును జయనగర్ నుంచి హెడ్‌బిఆర్ లేఅవుట్ కు తరలిస్తున్న సమయంలో ఇది జరిగింది.
జయనగర్ అశోక పిలర్ వద్ద మారుతి జెన్ కార్ వాన్ దారిని అడ్డుకున్నారు దుండగులు. వెంట వెంటనే ఒక ఇన్నోవా వాహనం ప్రత్యక్షమైంది. అందులో నుంచి బయటకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు “తాము RBI అధికారులమని, మీ సంస్థ RBI నిబంధనలు ఉల్లంఘించిందన్న ఫిర్యాదు వచ్చింది. మీ స్టేట్మెంట్ రికార్డు చేయాలి” అంటూ హడావిడి చేశారు. ఆశ్చర్యకరంగా CMS సిబ్బంది వారిని నమ్మారు. ఇద్దరు గన్‌మెన్ తమ లైసెన్స్ గన్స్ వాన్‌లో వదిలి కస్టోడియన్‌తో కలిసి ఆ ఇన్నోవాలో కూర్చొన్నారు. దారి మధ్యలో సిబ్బందిని దింపేసి స్టేషన్‌కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని ఉడాయించారు. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న వాన్ డ్రైవరును మరో కారులో వెళ్లి తుపాకీతో బెదిరించి డబ్బు తీసుకుని ఉడాయించారు.
దీని తర్వాత CMS సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా 8 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతోంది. జెన్ కార్ వాన్ దారిని బ్లాక్ చేయగా.. ఆ తరువాత వచ్చిన ఇన్నోవా ముందు నంబర్ ప్లేట్‌పై భారత ప్రభుత్వ లోగో ఉందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. పోలీసులు ఆ ప్లేట్ నకిలీదని, కాళ్యాణ్‌నగర్‌కు చెందిన ఒక వ్యక్తి సొంత కారు నంబరని నిర్ధారించారు. అయితే తమ సిబ్బందిపై ఎలాంటి అనుమానం లేదని CMS సంస్థ అధికారి నటరాజ్ చెబుతున్నారు. మెుత్తానికి ఆర్బీఐ అధికారుల మంటూ నడిరోడ్డుపై కోట్లు దోచుకెళ్లటం కలకలం సృష్టిస్తోంది.
