హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్ చాంపియన్‌గా బెంగళూరు టార్పెడోస్ నిలిచింది. ఆదివారం జరిగిన టైటిల్ ఫైట్‌లో బెంగళూరు 3–0 (15–13, 16–4, 15–13)తో ముంబై మీటియర్స్‌పై నెగ్గింది. మిడిల్ జోన్ నుంచి పోటీపడిన ఇరుజట్లు ఫైనల్‌ను నెమ్మదిగా ఆరంభించాయి. పీటర్ ఒస్ట్విక్ బ్లాక్‌లతో జోయెల్ బెంజిమెన్ స్పైక్‌లను నిలువరించాడు.
శుభమ్ చౌదరీ స్పైక్‌లను జిష్ణు బ్లాక్ చేయడంతో బెంగళూరు శిబిరంలో ఉత్సాహం పెరిగింది. సేతు సర్వీస్‌లతో ఒత్తిడి పెంచగా ముంబై సూపర్ పాయింట్ తీసుకుంది. అయితే ముంబై ఆఖరి వరకు పోరాడినా.. కెప్టెన్ సెట్టర్ మాట్ వెస్ట్ ప్రభావంతో బెంగళూరు తొలి సెట్‌లో పైచేయి సాధించింది. సూపర్ సర్వ్‌తో రెండో సెట్‌ను జోరుగా ఆరంభించిన బెంగళూరు చివరి వరకు అదే ఊపును కొనసాగించింది.
ముంబై అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. స్పైకర్లు మంచి సెటప్‌లు చేసినా ప్రయోజనం దక్కలేదు. జలెన్ పెన్రోవ్ మూడో సెట్‌లో బెంగళూరు శిబిరంలోకి రావడంతో స్పైక్ బలం పెరిగింది. శుభమ్ చౌదరి ఎదురుదాడి చేసినా బెంగళూరు ఆట ముందు నిలవలేకపోయాడు.
