వెలుగు ఓపెన్ పేజీ : ఐపీఎల్ పై బెట్టింగ్ మాఫియా పంజా

వెలుగు ఓపెన్ పేజీ : ఐపీఎల్ పై  బెట్టింగ్ మాఫియా  పంజా

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్  ఐపీఎల్.  ప్రపంచమంతటా  క్రికెట్ ప్రియులు  ఐపీఎల్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.   వారి ఉత్సాహాన్ని ఆసరాగా చేసుకుని కోట్లు సంపాదించడానికి బెట్టింగ్ మాఫియా అడుగులు వేస్తోంది.  యువత  బెట్టింగ్ ఆడడం కేవలం సరదా కోసమే మొదలుపెట్టినా ఆ  తర్వాత మాత్రం అది వ్యసనంగా మారి అమూల్యమైన జీవితాలను నాశనం చేస్తున్నది.  యువతను అప్పులపాలు చేస్తూ వాటిని తిరిగి చెల్లించలేక వారిని  ఆత్మహత్యలు చేసుకునే  పరిస్థితికి దారితీస్తోంది.   అప్పులు చెల్లించని కారణంగా ఎదుటి వ్యక్తుల చేత హత్యలు కూడా చేయిస్తోంది.

జీవితంలో అన్నీ కోల్పోయి సమాజంలో  కుమిలిపోతూ బతికే పరిస్థితికి తీసుకొస్తోంది.  బెట్టింగ్ పర్యవసనాల  కారణంగా  ఎన్నో  కుటుంబాలు  బాధతో ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.  చదువుకున్నవారు,  చదువులేనివారు అన్న తేడా లేకుండా.. ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఈ బెట్టింగ్ మాఫియా మాయలో పడి సర్వం కోల్పోయినవారిలో ఉన్నారు. 

వ్యసనంగా బెట్టింగ్​

ఒక్క క్రికెట్ ఆటలోనే కాదు అన్ని ఆటల్లోనూ బెట్టింగ్ అనేది  వ్యసనంగా మారింది.  బెట్టింగ్  నిర్వహించే వ్యక్తులు ముందుగా  అధిక రేషియోలు ఇచ్చి,  ఎక్కువ మొత్తంలో  లాభాలు చూపించి యువతకు బెట్టింగ్ నిరంతర  అలవాటుగా మార్చిన తర్వాత  రేషియోను తగ్గిస్తూ యువత నుంచి డబ్బును కాజేస్తున్నారు.  వినియోగదారులు  బెట్టింగ్  గెలిచి  విత్ డ్రా  చేసుకునే  సమయంలో  సాంకేతిక  సమస్యలు  ఉన్నాయని లేదా మీరు గెలిచిన డబ్బులు సగం వరకే చెల్లించడం  సాధ్యమవుతుందని  సాకులు చెబుతున్నారు.  చివరికి ఐడీలు బ్లాక్ చేసి బెట్టింగ్ యాప్ లేదా వెబ్ సైట్ ను  మొత్తానికే  లేకుండా డిలీట్ చేస్తున్నారు.  ఒకవేళ  వినియోగదారులు బెట్టింగ్ ఓడితే  కనురెప్ప కాలంలో బ్యాంకు ఖాతా  నుంచి  డబ్బు ఖాళీ అవుతుంది.  కొందరు కేటుగాళ్లు నకిలీ వెబ్​సైట్స్​ క్రియేట్ చేసి,  నకిలీ బెట్టింగ్ యాప్​లు  తయారు చేసి వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని,   ఫొటోలను,  బ్యాంకు ఖాతాల నంబర్లను దొంగలించి స్కామ్​లు  చేస్తున్నారు.  బెట్టింగ్​ను  అరికట్టాలి. ముఖ్యంగా  బెట్టింగ్ యాప్  ఓనర్స్  పేరున్న  సోషల్ మీడియా  ఇన్​ఫ్లూయర్స్​తో,  మూవీ  సెలబ్రిటీలతో వారి యాప్​లను ప్రమోషన్స్ చేయిస్తూ, వారు కూడా బెట్టింగ్ ఆడుతున్నట్టు ప్రచారం చేస్తూ యువతను బెట్టింగ్ ఆడేవిధంగా ప్రోత్సహిస్తున్నారు. దేశంలో 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న యువతే ఎక్కువ  బెట్టింగ్ మాఫియాకు బలవుతున్నారు. తల్లిదండ్రుల చెమట కష్టాన్ని అరక్షణంలో ఆవిరి చేస్తున్నారు.   బెట్టింగ్ ఆడే వ్యక్తులను మభ్యపెడుతూ బెట్టింగ్ అనే ఊబిలో నుంచి బయటపడకుండా వ్యసనంగా మలుస్తున్నారు.  కాబట్టి యువత సెలబ్రిటీల ప్రమోషన్స్ నమ్మి బెట్టింగ్ లో  పాల్గొనడం మొదలుపెడితే  మొదటికే మోసం వస్తుంది.  వారంతా బెట్టింగ్ యాప్ ఓనర్స్ ఇచ్చే డబ్బుల కోసం ప్రమోషన్స్ చేస్తారు.  ఒక్క రాత్రిలోనే లక్షలు సంపాదించాలనే ఆశతో  యువత జీవితాలు  ఆవిరైపోతున్నాయి.  యువత జీవితాల భద్రతకై ప్రభుత్వాలు ఇప్పటికైనా బెట్టింగ్ యాప్  లను,  వెబ్ సైట్లను నిర్వహించే వారిపై కఠినచర్యలు తీసుకొని బెట్టింగ్​ను పూర్తిగా అరికట్టాలి. 

- హరీష్ సాగర్
సాందీపని మాసపత్రిక స్టేట్ కన్వీనర్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.