మునుగోడు బైపోల్ రిజల్ట్పై జోరుగా బెట్టింగులు

మునుగోడు  బైపోల్ రిజల్ట్పై  జోరుగా బెట్టింగులు

మునుగోడు బైపోల్ రిజల్ట్పై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. పోలింగ్ రోజు చివరి మూడు గంటల్లో 20 శాతం ఓట్లు పోలవడంతో గెలుపోటములను అవే డిసైడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో చివరి మూడు గంటల పోలింగ్ పైనే పెద్ద ఎత్తున బెట్టింగ్ సాగుతోంది.

టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల గెలుపుపై వేల నుంచి లక్షల్లో పందాలు కాస్తున్నారు. ఇందుకోసం బుకీలు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకున్నారు. ఐపీఎల్ తరహాలో వారిని రంగంలోకి దించి బెట్టింగులను ప్రోత్సహిస్తున్నారు. హైదరాబాద్లోని పలు హోటళ్లలో రూమ్లు అద్దెకు తీసుకొని బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఏపీలోని గుంటూరు, విజయవాడ, వైజాగ్లో ఏజెంట్లను నియమించుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 

పోలింగ్కు 48 గంటల ముందు నుంచి బెట్టింగులు ఊపందుకున్నాయి. పోలింగ్ రోజు ప్రతి రెండు గంటలకు నమోదవుతున్న పోలింగ్ శాతాన్ని బట్టి బెట్టింగులు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల వరకు బెట్టింగులు ఒకస్థాయిలో ఉండగా .. ఆతర్వాత మూడు రెట్లు అదనంగా బెట్టింగ్ సాగినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఇంచార్జులుగా ఉన్న గ్రామాల్లో ఎవరికి లీడ్ వస్తుంది ? ఈటల రాజేందర్ అత్తగారి ఊరిలో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయి ? అనే   దానిపై జోరుగా బెట్టింగ్ నడిచినట్లు సమాచారం.

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వైపే మొగ్గు ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే సాయంత్రం 5 గంటల వరకు ట్రెండ్ ఒకలా ఉంటే ... ఆ తర్వాత అసలు కథ మొదలైనట్లు చెబుతున్నారు. సాయంత్రం వరకు గెలుపు ధీమాలో ఉన్న అధికార పార్టీ చివరి మూడు గంటల్లో నమోదైన పోలింగ్ ఎవరికి లాభిస్తుందని లెక్కలేస్తోంది. కాగా రేపు ఉపఎన్నిక కౌంటింగ్ జరగనుంది.