భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి : దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్

భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి : దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్
  • అధికారులకు శైలజారామయ్యర్ ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించారు. మొదటి దశ పనులు గోదావరి పుష్కరాల నాటికి పూర్తి కావాలని, వచ్చే వారంలో నిర్మాణ పనులను ప్రారంభించాలని చెప్పారు. భద్రాచలం ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆర్కిటెక్ట్ కృష్ణమూర్తితో కలిసి బుధవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా శైలజా రామయ్యర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల ప్రారంభానికి ముందు నిత్యకల్యాణ మండపం, దాసాంజనేయస్వామి మండపం, చిత్రకూట మండపం, దేవస్థానం కార్యాలయం, తూర్పు ప్రసాద కౌంటర్లు, మ్యూజియం, అద్దాల మండపం వంటి నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుందన్నారు. ఆలయ నిత్య కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తిచేసి, పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, గోదావరి పుష్కరాల నిర్వహణకు అవసరమైన ఘాట్లను నిర్మించాలని సూచించారు.