ఖరీఫ్ ముగుస్తున్నా రైతుబంధు అందడం లేదు: భద్రాద్రి కొత్తగూడెం రైతులు

ఖరీఫ్ ముగుస్తున్నా రైతుబంధు అందడం లేదు: భద్రాద్రి కొత్తగూడెం రైతులు

ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా రైతుబంధు పెట్టుబడి అందడం లేదు అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు. బ్యాంకు రుణాలు మాఫీ కాకపోవడంతో వడ్డీలు చెల్లించాల్సి వస్తోందంటున్నారు. పెట్టుబడి సాయం ఎప్పుడు అందుతుందో సమాచారం కూడా తెలియడం లేదంటున్నారు అన్నదాతలు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతుబంధు పథకం ఖరీఫ్ చెల్లింపులు నెలా పదిహేను రోజులుగా నిలిచిపోయాయి. అశ్వారాపేట డివిజన్ లో 32 వేల 807 మంది రైతులకు సంబంధించిన పాస్ పుస్తకాలు పెట్టుబడి సాయం కోసం ఆన్ లైన్ అయ్యాయి. ఈ జాబితా ట్రెజరీకి కూడా వెళ్లింది. జూన్  నెలాఖరులో డివిజన్  పరిధిలో 15 వేల 850 మంది రైతులకు 20 లక్షల 24 వేల 85 రూపాయల సొమ్మును ఖాతాల్లో జమచేశారు. కానీ మిగిలిన వారికి ఇప్పటి వరకు నగదు రాలేదు.

ఖరీఫ్  సీజన్  దాదాపు చివరి దశకు చేరుకుంది. డివిజన్ లో ఇంకా 16 వేల 957మంది రైతులకు 35 కోట్ల 24 లక్షల 38 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు 35శాతం మంది రైతులకే రైతుబంధు పెట్టుబడి సాయం అందింది. జిల్లాఅంతటా వందల కోట్లలోనే పెట్టుబడి సాయం బకాయిలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

ఏటా ఖరీఫ్, రబీలో రెండు విడతలుగా ఎకరానికి 10 వేల పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించింది ప్రభుత్వం. మరో నెల రోజుల్లో రబీ సీజన్ ప్రారంభం అవుతోంది. ఖరీఫ్ లో చెల్లించాల్సిన పెట్టుబడి సాయం కొద్దిమంది రైతులకే అందింది. మిగిలిన వాళ్లు సర్కార్ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. రుణమాపీ కాకపోవడంతో నాలుగేళ్ళుగా బ్యాంకుల్లో  వడ్డీ కట్టి.. రెన్యువల్ చేయించుకోవాల్సి వస్తోందంటున్నారు రైతులు. బ్యాంకుల్లో అప్పులు తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు.