నీట మునిగిన పంటలు..రైతులకు కోలుకోలేని దెబ్బ 

నీట మునిగిన పంటలు..రైతులకు కోలుకోలేని దెబ్బ 
  • కొట్టుకుపోయిన రోడ్లు, కూలిన కరెంట్​పోల్స్​
  • పలు ప్రాంతాలకు మిషన్​భగీరథ వాటర్​ సప్లై బంద్​

భద్రాచలం, వెలుగు: గోదావరి వరదలు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంత మండలాలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. 1986 తర్వాత గోదావరికి భారీగా వరదలు రావడంతో జిల్లా అతలాకుతలం అయింది. 36 ఏళ్ల తర్వాత భద్రాచలం వద్ద 71.30 అడుగులకు చేరుకోవడంతో 99 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 15,465 కుటుంబాలపై వరద ఎఫెక్ట్​పడింది. ఎడతెరిపిలేని వానలు, ఎగువ నుంచి వచ్చిన వరదలతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం రూ.129కోట్ల 53లక్షల 48వేలు నష్టం వాటిల్లినట్లు  ప్రాథమికంగా తేలింది. 

వరదలు రైతులకు కన్నీరు మిగిల్చాయి 

గోదావరి వరదలు అన్నదాతకు కన్నీళ్లే మిగిల్చాయి. భారీ వరదలతో బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లో వేల ఎకరాల్లో పంట నీటమునిగింది.  7,417 ఎకరాల్లో పత్తి, 3,305 ఎకరాల్లో వరి, 102 ఎకరాల్లో పచ్చిరొట్ట, 7 ఎకరాల్లో పెసర, 25 ఎకరాల్లో కూరగాయలు, 8 ఎకరాల్లో పసుపు, 2 ఎకరాల డ్రాగన్​ పంటలు నీటమునిగాయి. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం రూ.5.85కోట్లు, హార్టికల్చర్​ పంటలకు రూ.40.50లక్షల నష్టం వచ్చింది. మొత్తంగా 99 గ్రామాల్లో 5,047 మంది రైతులకు చెందిన 10,831 ఎకరాలు పంటలు నీటమునిగాయి.  

మునిగిన సబ్​స్టేషన్లు.. కొట్టుకుపోయిన కరెంట్​పోల్స్

గోదావరి వరదలకు తొమ్మిది 33/11 కేవీ సబ్​స్టేషన్లు నీటమునిగాయి. 65 కరెంట్​ పోల్స్ కొట్టుకుపోయాయి. 259 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయి. విద్యుత్​లైన్లు వరదల్లో మునగడంతో దాదాపు నాలుగు రోజుల పాటు చర్ల, దుమ్ముగూడెం మండలాలకు విద్యుత్​ సప్లై బంద్ అయింది.  దీంతో ఎలక్ర్టిసిటీ డిపార్ట్​మెంట్​కు 5.80కోట్లు మేర నష్టం జరిగింది.  మిషన్​భగీరథ పైపులైన్లు, యంత్రాలు నీటిపాలయ్యాయి. దీంతో 212 హ్యాబిటేషన్లకు తాగునీటి సప్లై ఆగింది. పంపుసెట్లు, ప్యానెల్​ బోర్డులు దెబ్బతిని మిషన్​భగీరథ స్కీంకు రూ.2.20కోట్లు నష్టం వచ్చింది. 

రోడ్లు దెబ్బతిని భారీగా నష్టం 

పంచాయతీరాజ్​, ఆర్అండ్​బి, నేషనల్​ హైవేస్​ వరదల తాకిడికి కొన్ని కోతకు గురికాగా మరికొన్ని కొట్టుకుపోయాయి. ​కొత్తగూడెం డివిజన్​లో పంచాయతీరాజ్ రోడ్లు పది చోట్ల దెబ్బతిని రూ.7.25కోట్ల నష్టం వచ్చింది. భద్రాచలం డివిజన్​లో 21 రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో రూ.5.55కోట్లు నష్టం వచ్చింది. మొత్తంగా ఆ శాఖకు రెండు డివిజన్లలో రూ.12.80కోట్ల నష్టం వచ్చింది. ఆర్అండ్​బీలో 35చోట్ల సర్ఫేస్​ డ్యామేజెస్​లతో 251.50 కిలోమీటర్లు దెబ్బతిని రూ.79.19కోట్లు, ఆరుచోట్ల డ్యామేజ్​ఆఫ్​సీడీ వర్క్స్ వల్ల రూ.20.77కోట్లు మొత్తంగా రూ.99.96కోట్ల నష్టం వచ్చింది. నేషనల్​హైవేస్​కు ఇల్లందు– -కొత్తగూడెం సెక్షన్​లో రూ.2కోట్లు, రుద్రంపూర్–భద్రాచలం సెక్షన్​లో రూ.52లక్షలు నష్టం వాటిల్లినట్లుగా సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. 

పంట చేతికొచ్చే టైంలో వరదలు దెబ్బతీశాయ్​

ఎన్నో ఆశలతో రూ.లక్షల పెట్టుబడి పెట్టి రెండెకరాల్లో డ్రాగన్ తోట సాగు చేశాను. ఇంకో నాలుగు వారాల్లో పంట కోసేందుకు ఏర్పాట్లు చేసుకున్నా. ఇంతలోనే గోదావరి ఉపద్రవం వచ్చి నా ఆశలను ఆవిరి చేసింది. 4వేల డ్రాగన్​ చెట్లు కుళ్లిపోయాయి. రూ.4లక్షల విలువ చేసే డ్రాగన్​ పండ్లు పాడైపోయాయి. 30 ఏళ్ల పాటు దిగుబడులు వస్తాయని ఆశతో ఉన్న నాకు ఈ వరదలు ఊహించని నష్టాన్ని తెచ్చి పెట్టాయి. - మజీద్, సంజీవరెడ్డి పాలెం