సర్కార్ విత్తనాలేసిన్రు..నిండా మునిగిన్రు

సర్కార్ విత్తనాలేసిన్రు..నిండా మునిగిన్రు
  •     రైతులకు కోట్లలో నష్టం
  •     నాసిరకం విత్తనాలు అంటగట్టారంటూ కొత్తగూడెం జిల్లాలో రైతుల ఆందోళన
  •     నిరసనగా డీఏవో ఆఫీస్ ముట్టడి

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగునాసిరకం విత్తనాలు రైతులను నట్టేట ముంచేశాయి. సర్కార్ మాటలు నమ్మి అధికారులిచ్చిన సీడ్స్ వేసి రైతులు రూ.కోట్లలో నష్టపోయారు. లాభం అటుంచితే కనీసం పెట్టుబడి కూడా రాలేదని భ్రద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మీరు చెప్పినట్టే విన్నాం. సర్కారు విత్తనాలు కొన్నాం. చివరకు దిగుబడి రాక పంట నష్టపోయాం. మాకు న్యాయం చేయాలి’ అంటూ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు.

అధికారులిచ్చిన సీడ్సే నాసిరకంగా ఉంటే ఎట్ల?

తమకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేస్తూ రైతులు.. సీపీఐ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని డీఏవో ఆఫీస్​ను సోమవారం ముట్టడించారు. రూ. కోట్లలో నష్టానికి కారుకులైన మండల వ్యవసాయశాఖాధికారిని సస్పెండ్​ చేయాలంటూ తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఏవోకు అందించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా మాట్లాడుతూ .. వ్యవసాయ శాఖ వద్ద కొన్న విత్తనాలే నాసిరకంగా ఉంటే ఇంకా ఎవరిని నమ్మాలని ప్రశ్నించారు. దీనిపై విచారణ చేయకుండా మండల వ్యవసాయశాఖాధికారి దళారులతో మంతనాలు సాగిస్తున్నారని ఆరోపించారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు.

సన్న రకాలే వేయమన్నరు..

వానాకాలం సీజన్ లో మక్కలు వేయొద్దు. సన్నరకం వరినే పండించాలంటూ అంటూ అధికారులు ప్రచారం చేశారు. మక్కలు వేస్తే కొనేది లేదని చెప్పడంతో జిల్లాలోని చాలా మంది రైతులు సన్నరకం ధాన్యం సాగు చేసేందుకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో కొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లి మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు .. కూనారం118 సన్నరకం సీడ్స్​తో 120 నుంచి 125 రోజుల్లోనే అధిక దిగుబడి వస్తుందని రైతులతో చెప్పారు. దీంతో ఆళ్లపల్లిలో దాదాపు 70 మంది రైతులు ఒక్కో బస్తా రూ. 650 చొప్పున విత్తనాలు కొనుగోలు చేశారు. అశ్వాపురం మండలంలోనూ వ్యాపారుల ద్వారా మరో 70 మందికిపైగా రైతులకు కూనారం118 విత్తనాలను అధికారులు అమ్మించారు. ఇంతటితో తమ పనైపోయిందనుకున్నారే తప్ప సీడ్స్​ను ఎలా ఉపయోగించాలి అనేదానిపై రైతులకు అవేర్నెస్ కలిగించలేదు. అదే ఇప్పుడు రైతుల కొంపముంచింది.

పెట్టుబడి కూడా రాలే

125 రోజుల్లోపే అధిగ దిగుబడులు వస్తాయన్న అధికారుల మాటలు నమ్మిన రైతులు కూనారం118 విత్తనాలను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేశారు. దాదాపు 500 ఎకరాల్లో పంట సాగు చేశారు. నాట్లు వేసిన 30 నుంచి 40 రోజుల్లోనే పంట ఈనింది. 60 రోజుల్లోనే వరి పండటంతో రైతులకు ఎటూపాలుపోలేదు.  ఒక్కో కుదురుకు సాధారణంగా 30 నుంచి 40 పిలకలు వస్తాయని, కూనారం సన్నరకం సీడ్స్​తో పది పిలకలు కూడా రాలేదని రైతులు లబోదిబోమంటున్నారు. ఎకరాకు 50 బస్తాల దిగుబడి వస్తుందని అధికారులు చెప్తే నమ్మి మోసపోయామని, ఇప్పుడు పంట పెట్టుబడి కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రైతు రూ.30 వేల నుంచి 40 వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేయగా.. ఆళ్లపల్లి మండలంలోనే దాదాపు రూ. కోటి నుంచి కోటిన్నర మేర నష్టపోయారని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం నేత ఎస్​.  శ్రీనివాస్ డిమాండ్​ చేస్తున్నారు.

ఎంక్వయిరీ చేస్తున్నం

‘గ్రామీణ విత్తన ఉత్పత్తి పథకంలో భాగంగానే ఈ సీడ్స్​ను తీసుకువచ్చాం. ఎక్కడ పొరపాటు జరిగిందో ఎంక్వయిరీ చేపట్టాం’ అని డీఏవో అభిమన్యు చెప్పారు. ఏడీఏను విచారణాధికారిగా నియమించామని, నష్ట పోయిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి, సమగ్ర విచారణ చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు.

అప్పు చేసి సాగు చేసినం.. మట్టే మిగిలింది

తక్కువ రోజుల్లోనే ఎక్కువ దిగుబడి వస్తుంది. ప్రభుత్వం సన్న రకాల వడ్లను కొనేందుకు మొగ్గు చూపిస్తంది. అని వ్యవసాయశాఖాధికారి చెప్పిన మాటలు విని మోసపోయిన. దిగుబడి బాగుంటే లాభాలు వస్తాయని ఆశతో 8ఎకరాల్లో కూనారం118 రకం సాగు చేసిన. చివరకు మట్టే మిగిలింది. అప్పు చేసి మరీ సాగు చేశా. కలెక్టర్​ సార్​ స్పందించి మాకు న్యాయం చేయాలి

–  రైతు, ఎన్​. వెంకన్న, ఆళ్లపల్లి

ఆరున్నర ఎకరాల్లో సాగు చేశా

మండల వ్యవసాయశాఖాధికారి శంకర్​ వచ్చి కూనారం118 సన్నరకం సీడ్స్​ వేయాలి, తక్కువ రోజుల్లో ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్తే ఆశపడ్డ. ఒక్కో సంచి సీడ్స్​ను రూ. 650చొప్పున అధికారుల నుంచి కొన్నాను. మొత్తం 10 సంచులు కొని ఆరున్నర ఎకరాల్లో పంట సాగు చేశాను. 120 రోజులకు దిగుబడి రావాల్సిన పంట 60 రోజులకే వచ్చింది. అదికూడా..అంతంతమాత్రంగానే వచ్చింది. అధికారులు మాయమాటలు చెప్పి మా కొంప ముంచారు. పంట నష్ట పరిహారం చెల్లించి ప్రభుత్వం  మాకు న్యాయం చేయాలె.

–కె. శ్రీను, ఆళ్లపల్లి