పంజాబ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం

పంజాబ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. గవర్నర్, మాన్ సర్కారుకు మధ్య మాటల యుద్ధం అనంతరం ఎట్టకేలకూ ప్రత్యేక సమావేశాల నిర్వాహణకు భన్వరీలాల్ అనుమతించారు. తొలుత ఒక్కరోజు సమావేశం ఏర్పాటు చేయాలని భావించినా.. అక్టోబర్ 3 వరకు సమావేశాలు కొనసాగించాలని నిర్ణయించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది. ఆప్‌ను గెలిపిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పునకు ఎలాంటి భయం లేదని, ఈ అంశంపై రాష్ట్రంలోని 3 కోట్ల ప్రజలకు భరోసా ఇచ్చేందుకు విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్టు ఆమ్ ఆద్మీ సర్కారు స్పష్టం చేశారు. అయితే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని బీజేపీ, కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించారు. 

విశ్వాస పరీక్షపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ, కాంగ్రెస్లపై సీఎం మాన్ మండిపడ్డారు. ఆపరేషన్ లోటస్ పేరుతో కమలదళం చేస్తున్న ప్రయత్నాలను ఎండగట్టిన ఆయన.. బీజేపీ ప్రతి చోటా తామే అధికారంలో ఉన్నట్లు వ్యవహరిస్తోందని చురకలంటించారు. మరోవైపు రాజస్థాన్ సంక్షోభాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ సభా నియమాల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్.. ముందు తమ ఇంటిని చక్కదిద్దుకోవాలని సీఎం సటైర్ వేశారు. ఇదిలా ఉంటే సీఎం భగవంత్ మాన్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగానే బీజేపీ ఎమ్మెల్యేలు అశ్వని శర్మ, జాంగి లాల్ మహాజన్ సభ నుంచి వాకౌట్ చేశారు. 117 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఆప్ కు 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 

తొలుత సెప్టెంబర్ 22న విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని మాన్ సర్కార్ భావించింది. అయితే కేవలం విశ్వాస తీర్మానానికే పరిమితమై సభను ఏర్పాటు చేసేందుకు గవర్నర్ పురోహిత్ పర్మిషన్ ఇవ్వలేదు. చివరకు రాజ్ భవన్, మాన్ సర్కారుకు మధ్య తలెత్తిన అభిప్రాయభేదాలు తొలగిపోవడంతో గవర్నర్ సమావేశాల నిర్వాహణకు అనుమతించారు.