కన్నతల్లి క్యాన్సర్తో పోరాడుతున్నా...వ్యాపారంలో నష్టపోయి..కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నా..ప్రతిభకు అవేమి అడ్డురావని హైదరాబాద్కు చెందిన పవర్ లిఫ్టర్ భాగ్యలక్ష్మి వైష్ణవ్ నిరూపించింది. అవాంతరాలను అధిగమించి..టర్కీలో జరుగుతున్న అంతర్జాతీయ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్లో సిల్వర్ మెడల్ సాధించింది. ప్రపంచ వేదికపై జాతీయ పతాకాన్ని రెపరెపలాడించింది.
ఏడుస్తూ వీడియో కాల్ చేశా..
పవర్ లిఫ్టింగ్లో పతకం సాధించినప్పుడు తనకు నాన్న గుర్తుకు వచ్చాడని 22 ఏళ్ల భాగ్యలక్ష్మి వైష్ణవ్ తెలిపింది. ఆ తర్వాత అమ్మకు ఏడుస్తూ వీడియో కాల్ చేశానని చెప్పింది. తనను క్రీడాకారిణిగా చూసేందుకు నాన్న తీవ్రంగా కష్టపడ్డాడు. ప్లైవుడ్ షాప్లో పనిచేస్తూ..కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతంలో నాన్న వ్యాపారం చేసి నష్టాల పాలయ్యాడు. తాము ముగ్గురు అక్కాచెల్లెళ్లం. ఒక సోదరుడు. 2015లో సోదరుడు బ్లాడ్ క్యాన్సర్తో మరణించాడు. అమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్. మేము ఆర్థికంగా చాలా నష్టపోయినా..మానసికంగా..నా కుటుంబం మద్దతు ఇచ్చింది..అని భాగ్యలక్ష్మి వైష్షవ్ చెప్పుకొచ్చింది.
అమ్మా నాన్నే నాకు స్పూర్తి..
బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతూ..కుటుంబాన్ని చూసుకుంటున్న అమ్మ తనకు స్పూర్తి అని భాగ్యలక్ష్మి వైష్ణవ్ తెలిపింది. తన ఆడపిల్లల కోసం అమ్మ ఎంతో చేస్తోంది. అందుకే నేను ఆమె కోసం క్రీడల్లో రాణిస్తున్నా. మా అమ్మ, నాన్న నాకు స్ఫూర్తి. నా ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో గతంలో మంగళూరులో జరిగే పోటీల్లో పాల్గొనడం ఇష్టం లేదని చెప్పా. అయితే పోటీల్లో పాల్గొనేందుకు నా తండ్రి అప్పులు చేశాడు...అని భాగ్యలక్ష్మి వివరించింది. టర్కీలో ఇద్దరు ఆటగాళ్ళు డయాబెటిస్, క్యాన్సర్ బాధపడుతున్నా..పోటీల్లో పాల్గొన్నారు. వారిని చూసి నేను మరింత స్పూర్తి పొందాను...అని భాగ్యలక్ష్మి వైష్ణవ్ వెల్లడించింది.
ఆడపిల్లలను ప్రోత్సహించండి..
దేశంలో చాలా మంది అమ్మాయిలు టాలెంట్ ఉన్నా నిరూపించుకోలేని అవకాశం లభించడం లేదని..వారందరిని ప్రోత్సహించాలని భాగ్యలక్ష్మి వైష్ణవ్ కోరింది. ఆడపిల్లలు పోరాడటానికి, సమస్యలను అధిగమించడానికి, వారి కలలను సాకారం చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పింది.
కరాటే టూ పవర్ లిఫ్టర్..
భాగ్యలక్ష్మి వైష్ణవ్ కు చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి కనభర్చేదని తండ్రి ధన్ రాజ్ వైష్ణవ్ తెలిపాడు. 11వ తరగతిలో మొదట కరాటే నేర్చుకునేందుకు వెళ్లేదని..ఆ తర్వాత పవర్ లిఫ్టింగ్ కు మారిందన్నాడు. కరీంనగర్ జిల్లా ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన ఆమెను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. అయితే భాగ్యలక్ష్మిను క్రీడలకు పంపొద్దని కుటుంబం..ఇతర వ్యక్తులు తనకు చెప్పినా వినలేదన్నాడు. టర్కీ ఛాంపియన్ షిప్లో గెలిచినప్పుడు తాను గర్వంగా ఫీలయ్యానన్నాడు. ఆమె కామన్వెల్త్ క్రీడల్లోనూ పాల్గొంటుందన్న నమ్మకం ఉందని..తన కుటుంబం భాగ్యలక్ష్మికి ఎప్పటికి మద్దతు తెలుపుతూనే ఉంటుందన్నాడు.
