ఘనంగా భారత మాత మహా హారతి కార్యక్రమం

ఘనంగా భారత మాత మహా హారతి కార్యక్రమం

హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత మాత మహా హారతి  కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవి శంకర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావుతో పాటు బీజేపీ నేతలు, బాలబాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సంస్కృతిక కార్యక్రమాలు  నిర్వహించారు. మూడువేల మంది బాలికలు భారత మాత వేషధారణలో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

భారత మాత మహా హారతి కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ హారతి కార్యక్రమం కుల, మత బేధం లేదనే భావన చెప్పడం కోసమే నిర్వహించారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎంతో మంది పోరాటయోధులు జాతికోసం, శాంతి కోసం తమ జీవితాలనే త్యాగం చేశారని గుర్తు చేశారు. భారతదేశం ఒక వసుదైక కుటుంబం అని చెప్పారు. భారతీయులు విస్తీర్ణం కోసం ఏనాడూ యుద్దాలు చేయలేదన్నారు. కళా సంపద ప్రపంచానికి ఒక తల్లిలాంటిందని అన్నారు. దేశానికి బ్రిటిష్ వారు వచ్చి దోచుకుని, వెళ్లారని, ఆర్థిక సంబంధాలను, సంస్కృతిని నాశనం చేశారని చెప్పారు. 

భారతదేశం ఉన్నత సంస్కృతిని యువత తెలుసుకుని.. స్ఫూర్తి పొందాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉన్నపుడు నిజమైన భారతీయులం అని చెప్పారు. కన్న తల్లిని, భారత భూమిని, అమ్మ భాషను ఎప్పుడు మరవద్దుని పిలుపునిచ్చారు. ‘పరాయి భాష కళ్ల అద్దాలు లాంటిది. మన భాష కళ్ళలాంటిది.  మన సంగీతం, సాహిత్యం కళలు అలవర్చుకోవాలి. మన చరిత్ర తిరిగి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా రాసుకోవాలి. కులం, మతం, వర్గం పేరుతో ఉండే శక్తులను దూరం పెట్టాలని కోరారు. 135 కోట్ల జనాభాకు హారతి కార్యక్రమం అన్నారు. అసమానతలు తొలగించి సమైక్య కోసం ముందుకెళ్లాలి.  అందుకోసం అందరూ కృషి చేయాలి’ అని వ్యాఖ్యానించారు.