సింగ‌‌రేణిలో 485 పోస్టుల‌‌కు నోటిఫికేష‌‌న్ ఇవ్వండి : భట్టి విక్రమార్క

సింగ‌‌రేణిలో 485 పోస్టుల‌‌కు నోటిఫికేష‌‌న్ ఇవ్వండి : భట్టి విక్రమార్క
  • కారుణ్య నియామకాలు స్పీడప్ చేయాలి
  • ఉద్యోగాల భర్తీలో పారదర్శకత పాటించాలి.. అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు
  • వేసవిలో కరెంట్ కొరత లేకుండా చూడాలి.. సింగ‌‌రేణి అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష

హైదరాబాద్‌‌, వెలుగు : సింగరేణిలో 485 పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ సిద్ధం చేయాలని సీఎండీ బలరామ్​ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఇందులో 317 డైరెక్ట్ రిక్రూట్​మెంట్ పోస్టులు, 168 ఇంటర్నల్ రిక్రూట్​మెంట్ పోస్టులు ఉంటాయని తెలిపారు. బుధవారం సెక్రటేరియెట్​లో సింగరేణి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియను వేగవంతం చేయాలి. ఈ ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకు ఉద్యోగాలు కల్పించాలి. పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలి. ఎగ్జామ్​లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదు. సింగరేణి ఉద్యోగ మేళాలో సీఎం రేవంత్ ఇచ్చిన హామీ మేరకు వారసుల వయో పరిమితిని 35 ఏండ్ల నుంచి 40 ఏండ్లకు పెంచే విషయంలో వేగంగా నిర్ణయం తీసుకోవాలి’’అని అధికారులకు భట్టి సూచించారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులకు గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని సీఎండీ బలరామ్ ప్రకటించారు.

ఈ నెల 26న సోలార్ ప్లాంట్ ఓపెనింగ్

సింగరేణి కార్మికుల కోసం ప్రమాద బీమాపై అధికారులతో భట్టి చర్చించారు. 43 వేల మంది ఉద్యోగులకు రూ.కోటి బీమా అందించడంతో వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత క‌‌ల్పించిన వార‌‌మ‌‌వుతామ‌‌ని తెలిపారు. ‘‘బీమాపై కార్మికులకు అవగాహన కల్పించాలి. కొత్తగూడెంలో నిర్మించిన 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్​ను ఈ నెల 26న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయండి. ఉద్యోగులు, అధికారుల కోసం హైదరాబాద్​లో గెస్ట్‌‌ హౌస్​ నిర్మిస్తాం. గోదావరిఖని, మంచిర్యాల కార్మికులకు మంచి నీరు అందించేందుకు చేపట్టిన రాపిడ్ గ్రావిటీ ఫిల్టర్లను ప్రారంభించడానికి రెడీ చేయాలి. ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలి’’అని అధికారులను భట్టి ఆదేశించారు. 

డిమాండ్​కు తగిన కరెంట్ ఇస్తాం

రాష్ట్రంలో నిరుటికి, ఈ ఏడాదికి పోలిస్తే కరెంట్ డిమాండ్ పెరిగిందని.. డిమాండ్ కు తగ్గట్టు రైతులు, పరిశ్రమలు, ఇతర వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్ అందిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. వేసవిలో కరెంట్ సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం సెక్రటేరియెట్ నుంచి ఎనర్జీ సెక్రటరీ రీజ్వితో కలిసి విద్యుత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓవర్ లోడ్, మెయింటెనెన్స్ సమయాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అధికారులు సమన్వయంతో వెంటనే సమస్య పరిష్కరించాలన్నారు. కమర్షియల్ ఏరియాల్లో మెయింటెనెన్స్ కోసం రాత్రిపూట లైన్ క్లియరెన్స్ (ఎల్ సీ) తీసుకుని పనులు చేపట్టాలన్నారు. గత పాలకులు చేసింది తక్కువ.. ప్రచారం ఎక్కువ చేసుకున్నారని విమర్శించారు. కొందరు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపై సైబర్ క్రైమ్ డిపార్ట్​మెంట్​కు ఫిర్యాదు చేయాలని అధికారులకు సూచించారు.