యాదగిరిగుట్ట గుడిలో కావాలనే చిన్న పీటపై కూర్చున్న: భట్టి

యాదగిరిగుట్ట గుడిలో కావాలనే చిన్న పీటపై కూర్చున్న: భట్టి
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
  • ప్రభుత్వంలో శాసించే స్థాయిలో ఉన్న
  • ఆత్మగౌరవం చంపుకునే వ్యక్తిని కాదు
  • ఎవరికో తలవంచే వాడిని కాదని వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: దళిత నేతకు దేవుడి సమక్షంలో అవమానం జరిగిందనే విమర్శలపై భట్టి విక్రమార్క స్పందించారు. యాదగిరిగుట్టలో జరిగిన ఘటనపై అర్థంపర్థం లేకుండా ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేశామని.. కావాలనే తాను చిన్న పీట మీద కూర్చున్నానని చెప్పారు. 

మంగళవారం బంజారాహిల్స్ లో సింగరేణి గెస్ట్​హౌస్​ ఫౌండేషన్​ కార్యక్రమం సందర్భంగా ఆయన యాదగిరిగుట్ట ఘటనపై స్పందించారు. ‘‘నేను ఈ రోజు  ఉప ముఖ్యమంత్రిగా ఆర్థికశాఖను, విద్యుత్‌‌‌‌, ప్రణాళిక శాఖలను నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో తీసుకునే అనేక ప్రణాళికలు, విధానపరమైన నిర్ణయాల్లో ప్రము ఖ పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్న.. నేనెవరికో తలవంచే వ్యక్తిని కాదు.. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వ్యక్తిని అంతకంటే కాదు.. ఆత్మగౌరవం చంపుకునే వ్యక్తిని కాదు.. ఎవరి ఆత్మగౌరవాన్ని తగ్గించే వ్యక్తిని కూడా కాదు.. సహృదయంతో దీన్ని అర్థం చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా..మిత్రులు ఎవరైనా ఆ ఫోటో చూసి మానసిక  క్షోభకు గురై ఉంటే అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా.. భవిష్యత్తులో కూడా మా ఈ సంకల్పాన్ని ఇదే దిశలో ముందుకు పోతం” అని ఆయన అన్నారు.

నేనే కావాలని అలా కూర్చున్న 

భట్టి ఆ ఘటనను వివరిస్తూ.. ‘‘నేను పాదయాత్ర చేసిన సందర్భంగా మార్గమధ్యంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుట్ట ఎక్కి మొక్కులు మొక్కడం జరిగింది.. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లినప్పుడు మనస్ఫూర్తిగా ఆ రోజు మేము కోరుకున్నట్లు మమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజు అవకాశం ఇచ్చారు.. ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుని ఈ రోజు లాంఛనంగా పేదవాళ్లకు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభోత్సవం చేయబోతున్నం.. మరొక్కసారి మొక్కు చెల్లించుకుంటూ.. నిండుమనస్సుతో మమ్మల్నీ ఆశీర్వదించ వలసిందిగా.. లక్ష్మీనరసింహస్వామిని వేడుకున్న’’ అని అన్నారు. స్వామి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా భక్తి శ్రద్ధలతో కావాలనే నేను అలా కూర్చున్నానని చెప్పారు.