V6 News

విద్యుత్ సరఫరాలో అంతరాయాలు అరికట్టాలి! : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

విద్యుత్ సరఫరాలో అంతరాయాలు అరికట్టాలి! : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • జాభవన్‌లో విద్యుత్​ శాఖ ఉన్నతాధికారులతో భట్టి సమీక్ష

హైదరాబాద్​, వెలుగు: విద్యుత్​సరఫరాలో అంతరాయాలను అరికట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో విద్యుత్​శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో భానుడి భగభగలకు తోడు ఇండ్లు, కార్యాలయాల్లో ఏసీలు, కూలర్ల వాడకం విపరీతంగా పెరిగిందని భట్టికి ఆఫీసర్లు  వివరించారు. దీనికి వ్యవసాయ అవసరాలు కూడా తోడవడంతో గ్రిడ్ పై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు.  

అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను తట్టుకుని నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. దేశవ్యాప్తంగా విద్యుత్ మార్కెట్ పై ఒత్తిడి ఉన్నప్పటికీ, రాష్ట్ర అవసరాల కోసం పవర్ ఎక్స్ఛేంజీల ద్వారా అదనపు విద్యుత్ కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. ఆసుపత్రులు, తాగునీటి సరఫరా పథకాలు, అత్యవసర సేవలకు నిరంతరాయంగా కరెంట్ అందించాలని ఆదేశించారు.

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, జల విద్యుత్ ఉత్పత్తిని సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, అన్ని విద్యుత్ సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వెల్లడించారు. రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ స్థిరంగా ఉందని, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు చేశామని అధికారులు మంత్రికి హామీ ఇచ్చారు.

పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అన్ని వర్గాల వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాను కొనసాగించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బందిని ఫీల్డ్ లో నిరంతరం అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు.