
ఫిరాయింపుల విషయంలో జగన్ చేసిన ప్రసంగం రాజ్యాంగాన్ని కాపాడే విధంగా ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క. ఫిరాయింపులను వ్యతిరేకించే జగన్ పార్టీ మార్పులను ప్రోత్సహించే వారితో ఎలా కలుస్తారని భట్టి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రారంభానికి జగన్ వస్తే వైఎస్సార్ చేసిన ప్రాణహిత తప్పని ఒప్పుకున్నట్టు అవుతుందన్నారు భట్టి.
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మొదలుపెట్టిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్‌ను మార్చి.. కాళేశ్వరంగా రీడిజైన్ చేశారని భట్టి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభానికి జగన్ వస్తే.. వైఎస్ జలయజ్ఞాన్ని తప్పుపట్టినట్లేనని విమర్శించారు. కాళేశ్వరం డీపీఆర్‌ను అసెంబ్లీలో ఇంతవరకు పెట్టలేదని, కాళేశ్వరం ప్రారంభానికి పక్క రాష్ట్రాల సీఎంలను పిలుస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో ఉన్న నేతలెవరూ కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. అవినీతిపై ప్రశ్నిస్తారనే ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని, పార్టీ ఫిరాయింపులపై జగన్ వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు.