ఐఏఎస్ లు కావలెను!.. తెలంగాణలో తీవ్ర కొరత

ఐఏఎస్ లు  కావలెను!.. తెలంగాణలో తీవ్ర కొరత
  • ఒక్కొక్కరికి మూడు నాలుగు శాఖల బాధ్యతలు
  • అదనంగా 45 మందిని కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నా నో రెస్పాన్స్​
  • రాష్ట్ర కేడర్​ ఐఏఎస్​లు 169..  ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్నది 140 మందిలోపే
  • 13 మంది కేంద్ర సర్వీసుల్లోకి.. మరికొందరు 
  • సెలవులు, పనితీరు బాగోలేక లూప్​ లైన్లలోకి
  • జూనియర్లకూ తప్పని కీలక శాఖలు.. 
  • కొన్నింటికి ఐపీఎస్, ఐఎఫ్​ఎస్​లు  
  • ఐఏఎస్​ల కొరతతో పాలనపై ఎఫెక్ట్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని సివిల్ ​సర్వెంట్ల కొరత తీవ్రంగా వేధిస్తు న్నది. ఐఏఎస్‌‌లు సరిపడా లేకపోవడంతో పాలనా పరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో కేటాయించిన స్ట్రెంత్​ను పెంచకపోవడం, జిల్లాల సంఖ్య పెరగడం, హైదరాబాద్​ విస్తరించడం,  సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ప్రయారిటీస్​ మారుతుండటంతో ఉన్న ఐఏఎస్‌‌లకే అదనపు బాధ్యతలు అప్పగించాల్సిన పరిస్థితి నెలకొంది. 

కీలక శాఖల కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో చాలా మంది ఏకకాలంలో మూడు, నాలుగు శాఖలను పర్యవేక్షించాల్సి వస్తున్నది. దీంతో ఫైళ్ల క్లియరెన్స్‌‌లో జాప్యం జరుగుతున్నది. ఏపీ క్యాడర్‌‌కు చెందిన ఐఏఎస్‌‌లు వెనక్కి వెళ్లాల్సి రావడం, కేంద్ర సర్వీసులకు పలువురు డిప్యుటేషన్‌‌పై వెళ్లడంతో జూనియర్లకు కీలక శాఖలను అప్పగించక తప్పడం లేదు. ఇక సివిల్​ సప్లయ్స్​, విజిలెన్స్​ వంటి పలు శాఖలను ఐపీఎస్​లు, ఐఎఫ్​ఎస్​లతో ప్రభుత్వం నెట్టుకొస్తున్నది.

దీనిపైనా ఇటీవల ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. రాష్ట్ర కేడర్​లో మొత్తం 169 మంది ఐఏఎస్​లు ఉండగా.. ఇక్కడ పనిచేస్తున్నది 140 మంది లోపే. 169కి తోడు మరో 45 మంది ఐఏఎస్​లను కేటాయించాలని ఎప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్నా స్పందన రావడం లేదు. 

ఒక్కరికే మూడు, నాలుగు శాఖలు

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కొద్దిపాటి ఐఏఎస్​ అధికారులకు అదనపు బాధ్యతలు తప్పడం లేదు. సీనియర్​ ఐఏఎస్​​ జయేశ్​ రంజన్​ సీఎంవో సీఈఓ (ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ సెల్)తో పాటు  స్పీడ్, టూరిజం, స్పోర్ట్స్ స్పెషల్ సీఎస్‌‌‌‌‌‌‌‌గా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. 

మరో సీనియర్​ ఐఏఎస్​ సబ్యసాచి ఘోష్‌‌‌‌‌‌‌‌కు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌షిప్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ స్కీమ్స్‌‌‌‌‌‌‌‌ బాధ్యతలతోపాటు అన్ని సంక్షేమ శాఖల స్పెషల్ సీఎస్‌‌‌‌‌‌‌‌ గా నియమించారు. ట్రాన్స్​కో సీఎండీగా ఉన్న కృష్ణ భాస్కర్ కు ఇటీవల సింగరేణి సీఎండీ  బాధ్యతలు అప్పగించారు. 

ఈయన డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీగానూ వ్యవహరిస్తున్నారు.  శశాంక టీజీఐఐసీ ఎండీ బాధ్యతలతో పాటు ప్రతిష్టాత్మకమైన ఫ్యూచర్ సిటీ కమిషనర్ బాధ్యతలను కూడా మోస్తున్నారు. ఈ. శ్రీధర్‌‌‌‌‌‌‌‌కు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శి బాధ్యతలతో పాటు బీసీ సంక్షేమ శాఖను అప్పగించారు. వి.పి. గౌతమ్ హౌసింగ్ సెక్రటరీగా ఉంటూనే రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డు, హౌసింగ్ కార్పొరేషన్ బాధ్యతలూ చూస్తున్నారు. 

సర్ఫరాజ్ అహ్మద్ మెట్రో ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా కీలక విధుల్లో ఉన్నారు. టి.కె. శ్రీదేవి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (ఔట్ సైడ్ హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ) సెక్రటరీగా, సీడీఎంఏ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా రెండు బాధ్యతలు చూస్తుండగా.. దివ్య దేవరాజన్ సెర్ప్ సీఈవో, మెప్మా ఎండీ బాధ్యతలతో పాటు ప్రజావాణి నోడల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు. 

ఇలంబర్తి రవాణా శాఖ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా ఉంటూనే పశుసంవర్ధక, మత్స్యశాఖల కార్యదర్శిగా, జ్యోతిబుద్ధ ప్రకాశ్ ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీ, కమిషనర్‌‌‌‌‌‌‌‌గా, కృష్ణ ఆదిత్య ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ, ఎస్సీ గురుకులాల సెక్రటరీగా.. ఇలా అందరూ మూడునాలుగేసి పోస్టుల్లో కొనసాగాల్సి వస్తున్నది. 

కేంద్ర సర్వీసుల్లో 13 మంది..కోర్టు తీర్పుతో ఏపీకి మరికొందరు

రాష్ట్రంలో ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ల కొరతకు మరో ప్రధాన కారణం పలువురు కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌‌‌‌‌‌‌‌పై వెళ్లడం. ప్రస్తుతం తెలంగాణ క్యాడర్‌‌‌‌‌‌‌‌కు చెందిన సుమారు 13 మంది సీనియర్ అధికారులు కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. వీరిలో శశాంక్ గోయల్, సంజయ్ జాజూ, గౌరవ్ ఉప్పల్, నీతూ కుమారి ప్రసాద్, పాసుమి బసు, అలుగు వర్షిణి, హరిచందన, శ్వేత మహంతి, రజత్ కుమార్ సైనీ వంటి వారు ఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్నారు. 

దీనికి తోడు ఇటీవల హైకోర్టు తీర్పుతో తెలంగాణలో కీలక బాధ్యతల్లో ఉన్న రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి వంటి అధికారులు ఏపీకి వెళ్లారు. వారు ఇక్కడే కొనసాగేందుకు దరఖాస్తు చేసుకున్నా కోర్టు కొట్టివేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉన్న కొన్ని సంస్థలు కూడా తెలంగాణలో ఉండటంతో, వాటికి కూడా రాష్ట్ర క్యాడర్ నుంచే అధికారులను కేటాయించాల్సి వస్తున్నది.  

లూప్ లైన్​లో సీనియర్లు..జూనియర్లకు కీలక బాధ్యతలు..!

పాలనా వ్యవహారాల్లో సీనియారిటీకి పెద్దపీట వేయాల్సి ఉన్నా.. కొన్ని ప్రత్యేక  పరిస్థితుల్లో పలు కీలక శాఖలను ప్రభుత్వం జూనియర్లకు అప్పగించింది.  ప్రభుత్వం మారిన తర్వాత వివిధ కారణాలు, పనితీరు ఆధారంగా కొందరు సీనియర్లను ‘నాన్ ఫోకల్’ (లూప్ లైన్) పోస్టులకు పరిమితం చేశారు. 

గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన స్మితా సబర్వాల్, అమోయ్ కుమార్, భారతి హోళికేరి వంటి వారిని ప్రాధాన్యం లేని పోస్టుల్లో ఉంచారు. అరవింద్ కుమార్‌‌‌‌‌‌‌‌ను డిజాస్టర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ స్పెషల్ సీఎస్‌‌‌‌‌‌‌‌కే పరిమితం చేశారు. ఇందులో స్మితా సబర్వాల్ సెలవులో ఉండగా, ముజమిల్ ఖాన్ వంటి వారు పోస్టింగ్ కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. 

కేంద్రాన్ని కోరినా నో రెస్పాన్స్​

రాష్ట్రంలో ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ల సంఖ్య పెంచాలని, మరో 45 మందిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 2014 విభజన తర్వాత క్యాడర్ రివ్యూ జరిపి పోస్టుల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేసినా.. కేంద్రం నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఏటా సివిల్స్ ద్వారా వచ్చే కొత్త అధికారుల కేటాయింపులోనూ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నదన్న వాదన ఉంది.

 ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ల కొరత కారణంగా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ కుంటుపడుతున్నది. ఇక జిల్లాలు చిన్నవి అయినప్పటికీ, ఆయా జిల్లాల్లో పరిపాలనను గాడిన పెట్టడంతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత సివిల్ సర్వెంట్లపైనే ఉన్నది.

రాష్ట్ర క్యాడర్​లో169.. పనిచేస్తున్నది 140 లోపే 

ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్​లో 169 మంది ఐఏఎస్​లు ఉన్నప్పటికీ ఇందులో 140 మంది లోపే  రాష్ట్రంలో పనిచేస్తున్నారు.  రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సుల మేరకు ఉమ్మడి ఏపీలోని ఐఏఎస్‌‌‌‌‌‌‌‌లను ఇరు రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసింది. ఆ సమయంలో తెలంగాణకు 163 పోస్టులను (శాంక్షన్డ్ స్ట్రెంత్) కేటాయించగా, ఏపీకి 211 పోస్టులు దక్కాయి. 

అయితే అప్పట్లో పనిచేస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉండటంతో తెలంగాణకు సుమారు 128 మంది మాత్రమే అందుబాటులోకి వచ్చారు. గతంలో 10 జిల్లాలు మాత్రమే ఉండగా, పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటిని 33 జిల్లాలకు పెంచింది. దీంతో కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల అవసరం అనూహ్యంగా పెరిగింది.

 ప్రతి జిల్లాకు ఇద్దరు అదనపు కలెక్టర్లను నియమించాల్సి రావడంతో క్షేత్రస్థాయిలో అధికారుల కొరత స్పష్టంగా కనిపిస్తున్నది. కేవలం జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీలోనే కమిషనర్‌‌‌‌‌‌‌‌తో పాటు నలుగురు ఐఏఎస్‌‌‌‌‌‌‌‌లు, హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏలో కమిషనర్, జాయింట్ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా ఐఏఎస్‌‌‌‌‌‌‌‌లు ఉండటం,  బయో డైవర్సీటీ, సింగరేణి వంటి వాటికి తెలంగాణ నుంచే ఐఏఎస్​లను నియమించింది. దీంతో మిగిలిన శాఖలకు అధికారులను సర్దుబాటు చేయడం కత్తిమీద సాములా మారింది.