పేదల ఉపాధిపై కేంద్రం దాడి.. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ

పేదల ఉపాధిపై కేంద్రం దాడి.. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ
  • ఉపాధి హామీ పథకాన్ని మోదీ సర్కారు నీరుగారుస్తున్నది: సోనియాగాంధీ
  • ఈ స్కీమ్‌‌ను బలహీనపర్చేందుకు 10  ఏండ్లుగా ప్రయత్నిస్తున్నది
  • ఇప్పుడు మహాత్ముడి పేరు తొలగించడమే కాకుండా 
  • పథకం స్వరూపాన్నే మార్చేసింది
  • దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్​ పోరాటం చేస్తుందని వార్నింగ్‌‌

న్యూఢిల్లీ: దేశంలోని కోట్లాది మంది రైతులు, కార్మికులు, భూమిలేని వారి ప్రయోజనాలపై కేంద్ర ప్రభుత్వం దాడి చేసిందని కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్ సోనియాగాంధీ అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈమేరకు శనివారం ఓ వీడియో సందేశాన్ని రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఉపాధి హామీ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బలహీనపరిచేందుకు మోదీ ప్రభుత్వం దశాబ్ద కాలంగా అనేక ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. ఇటీవల ఈ చట్టంలో  ఏకపక్షంగా మార్పులు చేసిందని మండిపడ్డారు. 

మహాత్ముడి పేరు తొలగించడంతో పాటు పథకం స్వరూపాన్నే మార్చేసిందన్నారు. కొత్త చట్టం ప్రకారం ఎవరికి ఎంత ఉపాధి, ఎక్కడ, ఏ విధంగా ఉపాధి లభిస్తుందో ఢిల్లీలోని ప్రభుత్వం నిర్ణయిస్తుందని, ఇది వాస్తవాలకు చాలాదూరంగా ఉందని తెలిపారు. గత 11 ఏండ్లుగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదల ప్రయోజనాలను విస్మరించిందని ఆరోపించారు.

ఏకపక్షంగా చట్టాన్ని మార్చడం దారుణం

20 ఏండ్ల క్రితం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో.. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏకాభిప్రాయంతో ఉపాధి హామీ చట్టం ఆమోదం పొందిన రోజు తనకు స్పష్టంగా గుర్తుందని సోనియా గాంధీ చెప్పారు. అదో విప్లవాత్మకమైన అడుగని అన్నారు. ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశంలోని అత్యంత పేదలు, అణగారిన వర్గాల వారి జీవితాలకు ఉపాధి కల్పించిందని చెప్పారు. 

ఉపాధి హామీ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో వలసలు ఆగిపోయాయని, నిరుపేదలకు ఉపాధికి హామీ లభించిందని తెలిపారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు తగ్గట్టుగా తీసుకొచ్చిన ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను.. ఇప్పుడు మోదీ ప్రభుత్వం అణచివేసిందని మండిపడ్డారు. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి చర్చ లేకుండా, ఎవర్నీ సంప్రదించకుండా, ప్రతిపక్షాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా చట్టాన్ని మార్చేయడం దారుణమని అన్నారు. 

ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్​ పార్టీ పోరాడుతుందని, తమ  లక్షలాది మంది కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యకర్తలు ఇందుకు సిద్ధంగా ఉన్నారని  తెలిపారు.