బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్యపై తస్లీమా నస్రీన్ ఆరోపణ
చేయని తప్పుకు.. అతడిని తోటి కార్మికుడే బలి చేశాడని వెల్లడి
దీపూ చంద్ర హత్య కేసులో ఏడుగురి అరెస్ట్: యూనస్
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ లోని మైమెన్ సింగ్ సిటీలో హిందూ యువకుడు దీపూ చంద్ర దాస్(27)పై జరిగిన మూకదాడి, హత్య ఘటనపై ఆ దేశ ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన ఆరోపణలు చేశారు. ఫ్యాక్టరీలో దీపూతో కలిసి పని చేస్తున్న ఓ ముస్లిం కార్మికుడు కావాలనే వ్యక్తిగత కక్షతో అతడిని బలి చేశాడని ఆమె వెల్లడించారు.
బంగ్లాదేశ్ లోని మైమెన్ సింగ్ సిటీలో పుట్టి పెరిగిన తస్లీమా.. ప్రస్తుతం భారత్ లో ప్రవాసంలో ఉన్నారు. దీపూ హత్య సందర్భంగా జరిగిన ఘటనల తీరును ఆమె శనివారం ‘ఎక్స్’లో వివరించారు. ‘‘దీపూ చంద్ర దాస్.. మైమెన్ సింగ్ సిటీ బలూకాలోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న పేద కార్మికుడు.
ఒకరోజు అతడికి, అతడితోపాటు పని చేస్తున్న ముస్లిం వర్కర్ కు చిన్న కారణంపై గొడవ జరిగింది. దీంతో దీపూపై పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో అతడు గురువారం ఫ్యాక్టరీ ముందు గుంపులో గట్టిగా అరిచాడు. మహమ్మద్ ప్రవక్తను అవమానించేలా దీపూ కామెంట్లు చేశాడని చెప్పాడు. దీంతో అక్కడున్న ముస్లిం యువకులంతా రెచ్చిపోయి, దీపూపై దాడి చేశారు.
అయితే, అతడిని పోలీసులు కాపాడి, కస్టడీలోకి తీసుకున్నారు. తాను మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేయలేదని, తన తోటి కార్మికుడు కావాలనే తనను ఇరికించాడని చెప్పాడు. కానీ, పోలీసులు కూడా గుంపుతో చేతులు కలిపారు. అతడి మాటలను పట్టించుకోకుండా అల్లరిమూకకు అప్పగించారు.
చివరకు జిహాదీలంతా అతడిని కొట్టి చంపి, చెట్టుకు వేలాడదీసి తగులెబెట్టి.. ఉన్మాదంతో సంబరాలు చేసుకున్నారు” అని తస్లీమా పేర్కొన్నారు. దీపూ కుటుంబం ఇప్పుడు దిక్కులేనిదైపోయిందని, జిహాదీల నుంచి తప్పించుకుని ఇండియాకు పారిపోయి వచ్చే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, తన కొడుకును అల్లరిమూక కొట్టి చంపి, కిరోసిన్ పోసి తగులబెట్టిన భయంకరమైన విషయం తమకు ఫేస్ బుక్ ద్వారానే తెలిసిందని దీపూ తండ్రి రవిలాల్ వెల్లడించారు. ఈ ఘటనను బంగ్లా ప్రభుత్వం ఖండించినప్పటికీ, తమకు న్యాయం చేస్తామన్న హామీ ఇవ్వలేదన్నారు.
దీపూ హంతకుల అరెస్ట్
బంగ్లాదేశ్ లోని మైమెన్ సింగ్ సిటీలో గురువారం రాత్రి హిందూ యువకుడు దీపూ చంద్ర దాస్(27)ను అల్లరిమూకలు కొట్టి చంపి, తగులబెట్టిన కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్ శనివారం ప్రకటించారు.
‘‘మైమెన్ సింగ్ సిటీలోని బలూకాలో సనాతన హిందూ యువకుడు దీపూ చంద్ర దాస్ హత్య కేసులో ఏడుగురు అనుమానితులను ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ పోలీసులు అరెస్ట్ చేశారు” అని ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు.
వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా గాలింపులు చేపట్టి, వీరిని పట్టుకున్నట్టు తెలిపారు. కాగా, దీపూ హత్యను యూనస్ సర్కారు శుక్రవారం తీవ్రంగా ఖండించింది. దేశంలో హింసకు తావులేదని, దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని పేర్కొంది.
తీవ్రంగా కలచివేసింది: ప్రియాంకా గాంధీ
బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడిపై మూకదాడి, హత్య ఘటన తీవ్రంగా కలచివేసిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. నాగరిక సమాజంలో కులం, మతంపై వివక్ష, హింస, హత్య వంటివాటిని మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే నేరాలుగా పరిగణించాలని ఆమె శుక్రవారం రాత్రి ట్వీట్ చేశారు.
కాగా, దీపూ చంద్ర దాస్ హత్య అతి దారుణమైన ఘటన అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. ఈ దాడిని బంగ్లా ప్రభుత్వం ఖండించినప్పటికీ, దోషులను కఠినంగా శిక్షించాలని భారత్ కోరాలన్నారు.
ఏడాదిలో 2,400 దాడులు: పవన్ కల్యాణ్
దీపూ హత్యను ఏపీ డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. గతేడాది ఆగస్ట్ నుంచి ఈ ఏడాది జులై మధ్యలోనే మైనార్టీలపై 2,400 దాడులు జరిగాయన్నారు. బంగ్లా ప్రభుత్వం ఇప్పటికైనా దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు.
యూత్ లీడర్ హాదీ అంత్యక్రియలు పూర్తి
షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ సర్కారును కూలదోయడంలో కీలక పాత్ర పోషించిన యూత్ లీడర్, ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ(32) అంత్యక్రియలు శనివారం ఢాకాలో పూర్తయ్యాయి. ఈ నెల12న ఎన్నికల ప్రచారం కోసం ఢాకాలోని బిజోయ్ నగర్ ఏరియాలో ఆటోలో వెళ్తుండగా అతడిపై దుండగులు కాల్పులు జరిపారు.
ఆరు రోజులు సింగపూర్ లో చికిత్స పొందిన అతడు గురువారం రాత్రి చనిపోయాడు. శుక్రవారం సాయంత్రం సింగపూర్ నుంచి హాదీ డెడ్ బాడీని ఢాకాకు తీసుకొచ్చారు. శనివారం ఢాకా వర్సిటీ సెంట్రల్ మసీదు సమీపం లోని బంగ్లా జాతీయ కవి కజీ నజ్రుల్ ఇస్లామ్ సమాధి పక్కన ఖననం చేశారు.
హాదీ అంత్యక్రియలకు హాజరైన వేలాది మంది ఈ సందర్భంగా భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘‘ఢిల్లీనా? ఢాకానా..? ఢాకా, ఢాకా..’’, ‘‘హాదీ చిందించిన రక్తాన్ని వృథాగా పోనివ్వం” అంటూ స్లోగన్స్ ఇచ్చారు.
అంత్యక్రియలకు మహమ్మద్ యూనస్‌తో పాటు మాజీ పీఎం ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్ ఈ ఇస్లామీ, నేషనల్ సిటిజన్ పార్టీ నాయకులు హాజరయ్యారు.
