పుర పోరులో మంత్రుల జోరు..గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూకుడు

పుర పోరులో మంత్రుల జోరు..గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూకుడు
  • పదేండ్ల రావణ పాలన అంతం: పొంగులేటి

తెలంగాణలో మునిసిపల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్​ తరఫున పలువురు మంత్రులు జిల్లాలవారీగా విస్తృతంగా పర్యటిస్తూ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మునిసిపాలిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పర్యటించారు. గత బీఆర్​ఎస్​ పేదలను పట్టించుకోలేదని, కమీషన్ల కోసం ప్రాజెక్టులు కట్టిందే తప్ప పేదల కోసం ఏం చేయలేదని విమర్శలు గుప్పించారు.

ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఎన్నిక ఏదైనా విజయం కాంగ్రెస్​దేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు పనికిమాలిన విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, కాంగ్రెస్​ నేతలు విమర్శలను తిప్పికొడుతూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో మంత్రి శ్రీధర్​ బాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్​ అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఖమ్మం రూరల్, వెలుగు: రాష్ట్ర ప్రజలు పదేళ్ల రావణాసుర పాలనకు ముగింపు పలికి ప్రజా పరిపాలనను తీసుకొచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీలో విస్తృత ప్రచారం నిర్వహించారు. మంచి ఉన్నంత కాలమే మర్యాద ఉంటుందని, అవసరమైతే యుద్ధం చేయాల్సిందేనని చెప్పారు. గత ప్రభుత్వం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని, పేదల కంటే దొరల ఇళ్లకే ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు.

హాస్టల్ విద్యార్థులకు సరిగా భోజనం పెట్టలేని వారు ఇప్పుడు మాటలు చెబుతున్నారని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, రూ.22,500 కోట్లతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఏప్రిల్ నుంచి మరో విడత ఇళ్ల పంపిణీ చేస్తామని వెల్లడించారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు డిపాజిట్లు కూడా దక్కకుండా ఓడించాలని పిలుపునిచ్చారు