అనుకున్న లక్ష్యం రెబల్స్ వల్లే చేరలేకపోయాం : సీఎం రేవంత్రెడ్డి

అనుకున్న లక్ష్యం రెబల్స్ వల్లే చేరలేకపోయాం :  సీఎం రేవంత్రెడ్డి
  •     15 నుంచి 20 నియోజకవర్గాల్లో సమన్వయ లోపం
  •     సీరియస్​ అయిన సీఎం రేవంత్​రెడ్డి
  •     పరిషత్​ ఎన్నికల్లో ఈ పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం
  •     పంచాయతీ ఫలితాలపై  పీసీసీ చీఫ్  మహేశ్ ​గౌడ్​,పార్టీ ఇన్​చార్జి మీనాక్షితో రివ్యూ

 హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం సర్పంచ్​ స్థానాలను కాంగ్రెస్​ మద్దతుదారులు గెలుచుకుంటారని ఆశించామని.. కానీ, రెబల్స్​ వల్ల కొన్ని తగ్గాయని సీఎం రేవంత్​రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సర్పంచ్​స్థానాలు అనుకున్న స్థాయిలో రాకపోవడంపై ఆయన సీరియస్​అయ్యారు. 15 నుంచి 20 నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాల వల్ల కాంగ్రెస్​కు నష్టం జరిగిందన్నారు. 

ముఖ్యంగా పార్టీ తరఫున ప్రతి గ్రామంలో ఇద్దరు నుంచి ముగ్గురు, నలుగురు పోటీపడ్డారని.. రెబల్స్​తో నామినేషన్లు విత్​డ్రా చేయించడంలో పలువురు ఎమ్మెల్యేలు, పలువురు డీసీసీ చీఫ్​లు విఫలమయ్యారని.. ఫలితంగానే ‘90శాతం లక్ష్యం’ చేరుకోలేకపోయామని అసహనం వ్యక్తంచేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై శుక్ర, శనివారాల్లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్ తో సమీక్షించారు. నియోజకవర్గాలవారీగా ఆయా పార్టీల నుంచి గెలిచిన సర్పంచ్​ల వివరాలు తెప్పించుకొని విశ్లేషించారు. 

ప్రధానంగా బీఆర్ఎస్​, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన చోట్ల కాంగ్రెస్​కు ఆశించిన స్థాయిలో సర్పంచ్​స్థానాలు రాలేదని గుర్తించారు. అదే సమయంలో కొన్ని చోట్ల కాంగ్రెస్​ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ సర్పంచ్​స్థానాలు తగ్గడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మద్దతుదారులు ఇద్దరు ముగ్గురు పోటీ చేసిన చోట్ల నష్టం జరిగిందని.. రెబల్స్​ను పోటీలో లేకుండా చూడడంలో అక్కడి ఎమ్మెల్యేలు, డీసీసీ చీఫ్​లు విఫలం చెందినట్లు తేలిందన్నారు. పరిషత్​ ఎన్నికల్లో ఈ పరిస్థితి తలెత్తకుండా పార్టీపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆ ఎమ్మెల్యేలకు  పీసీసీ చీఫ్​ మహేశ్​ ఫోన్​

 తక్కువ పంచాయతీలను గెలుచుకున్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహేశ్ గౌడ్ ఫోన్ చేసి మాట్లాడారు.  ఎందుకిలా జరిగిందో ఆరా తీశారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పరిషత్​ ఎన్నికల నాటికి గ్రూపుల సమస్య పరిష్కరించుకోవాలని, ఎక్కడా సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలని ఆయన తేల్చిచెప్పారు.