క్రోచెట్ పూలమాల పేరు విన్నారా?.. ఇది వాడిపోని వరమాల.. కలకాలం జ్ఞాపకంగా ఉంటుంది!

క్రోచెట్ పూలమాల పేరు విన్నారా?.. ఇది వాడిపోని వరమాల.. కలకాలం జ్ఞాపకంగా ఉంటుంది!

చలికాలంలో వెచ్చదనం కోసం క్రోచెట్​ స్వెటర్లు, మఫ్లర్లు, స్కార్ఫ్​లు వంటివి వేసుకుంటారు. మామూలుగా క్రోచెట్​ క్లాత్స్​, డెకరేటివ్ పీస్​ల ఎంబ్రాయిడరీ ఎంత అందంగా ఉంటుందో, ఇంట్లో పెట్టుకునే డెకరేషన్​ ఐటెమ్స్​లో కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి క్రోచెట్ డిజైన్స్​కి మరింత ప్రాముఖ్యత తెచ్చారు క్రోచెట్ వీవర్స్. అదెలాగంటే.. పెండ్లిలో వేసే వరమాలను క్రోచెట్​తో డిజైన్ చేశారు. దీంతో దారానికి పూలు గుచ్చితేనే కాదు.. దారాన్ని దారంతో అల్లినా పూలదండే తయారవుతుంది అని ప్రూవ్ చేస్తున్నాయి క్రోచెట్ కంపెనీలు. 

క్రోచెట్​ వరమాల పేరు విన్నారా? చాలా కొత్తగా ఉంది కదూ! అవును, పెండ్లిళ్లలో వధూవరులు మార్చుకునే వరమాలలు సాధారణంగా పూలతో అల్లుతారు. బంతి, చామంతి, గులాబీ, మల్లెలు, విరజాజులు, లిల్లీ, తామరపూలు వంటి సువాసన వెదజల్లే పూలతో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా తయారుచేస్తారు. పెండ్లి బట్టలు ధరించిన వధూవరులు అందరి సమక్షంలో దండలు మార్చుకోవడం ఆనవాయతీ. పెండ్లి అనేకాదు.. ఎంగేజ్​మెంట్, రిసెప్షన్​తోపాటు ఇప్పుడు జరుపుకుంటోన్న హల్దీ ఫంక్షన్​లలోనూ పూలదండలు వేసుకుంటారు. ట్రెడిషన్​ ఏదైనా పూలదండలు మార్చుకోవడం కామన్​. అయితే, పూలు సాయంత్రానికల్లా వాడిపోవడం వాటి నైజం. అందుకే రాత్రిపూట కార్యక్రమాలు పెట్టుకునేవాళ్లు ఆ టైం వరకు వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తారు. అలా చూసుకున్నా పొద్దుటికల్లా పూలు వాడిపోవడం సహజం. దీంతో క్రోచెట్ డిజైనర్స్​ కొత్త ట్రెండ్​ను పరిచయం చేశారు. పూల మాల వాడిపోకుండా, పర్యావరణానికి నష్టం కలగకుండా, కలకాలం గుర్తుండిపోయే జ్ఞాపకంలా దాచుకునేలా అదిరిపోయే ఐడియా ఆలోచించారు.

 అదే క్రోచెట్ వరమాల. క్రోచెట్​ అల్లికలతో అందంగా  పూల మాలలు అల్లేస్తున్నారు. పూలలో ఎన్ని రకాలున్నాయో అన్ని రకాలనూ ఊలు దారం అల్లికల్లో చూపిస్తున్నారు. పైగా ఈ దండలకు ముత్యాలు, బీడ్స్​ వంటివి జోడిస్తూ వధూవరులకు అందిస్తున్నారు. క్రోచెట్​ వరమాల చూడడానికి అందంగా కనిపించడంతోపాటు ఆ మధురమైన క్షణాలను గుర్తుచేసేలా దాచుకోవచ్చని అందరూ వీటిని ఇష్టపడుతున్నారు. కొందరైతే తమకు నచ్చిన పూలు, డిజైన్​లను క్రోచెట్ వీవర్స్​కు చెప్పి కస్టమైజ్ చేయించుకుంటున్నారు.  ఇప్పటికే ముంబై, బెంగళూరు నగరాల్లో పెండ్లి, యానివర్సరీ సెలబ్రేషన్స్​లో క్రోచెట్ దండలు ధరించి గెస్ట్​లను అట్రాక్ట్ చేశారు. 

జైన్స్ స్టోరీ అనే బ్రాండెడ్ కంపెనీ​ వీటిని ప్రారంభించింది. ఒక మాల తయారుచేయడానికి 14 నుంచి 20 గంటలు సమయం పడుతుంది. కాబట్టి ముందుగానే ఆర్డర్​ ఇస్తే, నాలుగు రోజుల ముందే డెలివరీ చేసేస్తారు. ఈ ట్రెండ్ ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు క్రిస్మస్ సీజన్​ కాబట్టి చాలామంది ఇంటి గుమ్మాలు, లోపల డెకరేషన్స్​ని పూల దండలకు బదులు క్రోచెట్​ డిజైన్స్​తో నింపేస్తున్నారు. క్రిస్మస్ ట్రీ కూడా క్రోచెట్​ డిజైన్​లో కనిపిస్తోంది.