మల్లన్న జాతరను సక్సెస్ చేద్దాం : మంత్రి కొండా సురేఖ

మల్లన్న జాతరను సక్సెస్ చేద్దాం :  మంత్రి కొండా సురేఖ
  • భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు ఉండాలి
  • జాతరను ప్లాస్టిక్ ఫ్రీగా జరుపుదాం 
  • హనుమకొండ కలెక్టరేట్ లో మంత్రి కొండా సురేఖ రివ్యూ మీటింగ్

హనుమకొండ, వెలుగు: ఐనవోలు మల్లన్న జాతరను సక్సెస్ చేసేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.  భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించాలని, ముఖ్యంగా శానిటేషన్, వాటర్ సప్లై దృష్టిపెట్టాలని సూచించారు. జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.  జనవరి 13 నుంచి జరగనున్న జాతర ఏర్పాట్లపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీశ్, గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి శనివారం హనుమకొండ కలెక్టరేట్ లో రివ్యూ నిర్వహించారు. ముందుగా మంత్రి జాతర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. 

 జాతరలో దివ్యాంగులు,  వృద్ధులు, గర్భిణులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు, మహిళలకు ప్రత్యేక టాయిలెట్స్ సౌకర్యం కల్పించాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో ఎక్కడా నీళ్లు నిల్వ, శానిటేషన్ లోపాలు ఉండొద్దని, గుడి చుట్టూ అందంగా లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఆమె స్పష్టంచేశారు.  భక్తుల రద్దీకి తగ్గట్టుగా బస్సులు నడపాలని ఆర్టీసీ ఆఫీసర్లకు సూచించారు. భక్తుల సౌకర్యార్థం  ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయించాలన్నారు. పోలీసులు ఫ్రెండ్లీ సర్వీస్ అందించాలని, ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు పెంచాలన్నారు. మంచిగా పని చేసిన శాఖలకు ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి తెలిపారు.  ఈ సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, హనుమకొండ ఆర్డీవో రమేశ్ రాథోడ్, ఐనవోలు ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్ గౌడ్, ఈవో సుధాకర్, కుడా సీపీవో అజిత్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

బలవంతపు వసూళ్లపై మంత్రి సీరియస్

 మల్లన్న ఆలయంలో  భక్తుల నుంచి బలవంతంగా డబ్బుల వసూళ్లకు పాల్పడితే సీరియస్ యాక్షన్ ఉంటుందని  మంత్రి హెచ్చరించారు.  మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న తీరుపై 'వెలుగు'లో శనివారం కథనం పబ్లిష్ అయిన విషయం తెలిసిందే. దీంతో  మల్లన్న జాతర ఏర్పాట్ల రివ్యూ సందర్భంగా మంత్రి స్పందించారు. వెంటనే ఒగ్గు పూజారులతో మీటింగ్ పెట్టాలని ఈవో సుధాకర్ ను సూచించారు. భక్తులు ఇష్టపూర్వకంగా ఇస్తేనే  ఒగ్గుపూజారులు తీసుకోవాలని, అడిగినంత ఇవ్వలేదని మల్లన్న పట్నం మధ్యలో ఆపేసే వారిని ఇంకోసారి ఆలయ ఆవరణలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని ఈవోను ఆదేశించారు.