కోటపల్లి, వెలుగు: దేశ ప్రజల ఉపాధికి తూట్లు పొడిచి, వారిని ఆర్థికంగా దెబ్బ తీయడమే బీజేపీ ప్రభుత్వ విధానమని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(టీఏజీఎస్) మంచిర్యాల జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రం చూస్తోందని ఆరోపిస్తూ శనివారం కోటపల్లి మండలం సుపాక గ్రామంలో నిరసన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన అజీవిక మిషన్ 2025 పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఉపాధిని దెబ్బతీయడమే బీజేపీ చెబుతున్న దేశభక్తా? అని ప్రశ్నించారు.
పథకం పేర్లను మార్చి, పని దినాల సంఖ్యను తగ్గించి, నిర్వహణ భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యాయమన్నారు. ప్రజలందరూ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం నేతలు తలండి ముత్తయ్య, మహేశ్, లచయ్య, హనుమంత్, రామస్వామి, బానయ్య, శంకర్ పాల్గొన్నారు.
