- సర్పంచ్ ఎన్నికల ఫలితాలే మాకు రెఫరెండం: మల్లు రవి
న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు చేస్తున్న తప్పుడు విమర్శలే... సీఎం రేవంత్ రెడ్డికి ఆశీస్సులుగా మారి మెరుగైన పాలన అందించడంలో ఉపయోగపడుతున్నాయని కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ మల్లు రవి అన్నారు. తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నిలకల ఫలితాలే తమ పాలనకు రెఫరెండం అని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, రాబోయే ఏ ఎన్నికల్లో అయినా వాళ్లు కాంగ్రెస్ కే మద్దతు ఇస్తారన్నారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ గురజాడ హాల్ లో శనివారం మల్లు రవి మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ హామీలు అమలుకావడం లేదంటూ కిషన్ రెడ్డి, కేటీఆర్, హరీశ్ రావు, ఇతర నాయకులు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదు. తెలంగాణలో మొత్తం 12,702 పంచాయతీలకి ఎన్నికలు జరిగితే... 8,335 పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచారు. అంటే దాదాపు 66% పంచాయతీల్లో మా పార్టీ విజయం సాధించింది.
త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 నుంచి 75% వరకు స్థానాల్లో విజయం సాధిస్తది. కేటీఆర్ ఏమో.. ప్రజలు తమకే పట్టం కట్టారంటూ ఊరూరా తిరగడం హాస్యాస్పదంగా ఉన్నది’’అని మల్లు రవి అన్నారు. అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. తాజా సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను వివరించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై ప్రియాంక గాంధీ సంతృప్తిని వ్యక్తం చేశారన్నారు.
