మొఘల్ వంశంలో తిరుగులేని చక్రవర్తి... షాజహాన్ రాజకీయ మేధాశక్తి, సైనిక నైపుణ్యాలు ఇవే..!

మొఘల్ వంశంలో తిరుగులేని చక్రవర్తి... షాజహాన్ రాజకీయ మేధాశక్తి, సైనిక నైపుణ్యాలు ఇవే..!

మొఘల్ రాజవంశంలో ఐదో చక్రవర్తి అయిన ‘అలా అజద్‌ అబ్దుల్ ముజఫ్ఫర్ షిహాబుద్దీన్ షాజహాన్​’ ప్రపంచానికి తాజ్​మహల్ నిర్మాతగా తెలుసు. 1592, జనవరి 5న లాహోర్​లో జన్మించాడు. ఆయన వాళ్ల నాయనమ్మ రుఖయ దగ్గర పెరిగాడు. చిన్నప్పుడు షాజహాన్​ని వాళ్ల తాత ముద్దుగా ‘ఖుర్రం’ (సంతోషి) అని పిలిచేవారు. ఛగ్తాయ్ మొఘలుల సంప్రదాయం ప్రకారం నాలుగేండ్ల, నాలుగు నెలల, నాలుగో రోజున అతన్ని స్కూల్లో చేర్పించారు. అయితే ఖుర్రం సొంత ఆదర్శాలతో ఎదిగాడు. 

అన్నిరంగాలలో తాత అక్బర్​ని అనుసరించాలి అనుకునేవాడు. అతనికి ఆర్ట్​, నేచర్​ అంటే చాలా ఇష్టం. మనుషుల్ని అర్థం చేసుకునేవాడు. చదువులో పండితుడు కాలేదు కానీ, యుద్ధ విద్యలలో మాత్రం ఆరితేరాడు. రాజవంశవారసుడిగా సాహసోపేతమైన చర్యలతో ఆశ్చర్యపరిచేవాడు.15 సంవత్సరాల వయసులో ఇతిఖాద్​ ఖాన్​ కూతురైన అర్జుమంగ్​ బాను బేగం(ముంతాజ్)తో నిశ్చితార్థం జరిగింది. వివాహం వాయిదా పడింది. 

1610లో మీర్జా ముజఫ్పర్​ హుసేన్ సఫానీ కూతురుతో వివాహం జరిపించాడు. 1612లో అర్జుమంగ్ బానుతో పెండ్లి అయింది. తనే ముంతాజ్ మహల్. షాజహాన్​కు ఆమె అంటేనే ప్రేమ. వాళ్లిద్దరికీ 14 మంది పిల్లలు పుట్టగా వాళ్లలో ఏడుగురు బతికారు. వాళ్ల ప్రేమకు గుర్తుగా ముంతాజ్​ మరణానంతరం ఆమె సమాధిని ‘తాజ్​మహల్’​గా కట్టించాడు. అది ఇప్పుడు ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి. 
రాజకీయ మేధాశక్తి, సైనిక నైపుణ్యాలు విజయపథంలో నడిపించాయి. 

మేవార్ యుద్ధరంగంలో గెలిచిన ఆయన్ని దక్కన్​కు బదిలీ చేశారు. ఆరునెలల్లోనే దక్కన్​ సమస్యలను పరిష్కరించాడు. గౌరవాలు, బహుమతులతోపాటు ఇంతవరకు ఏ తైమూర్​ రాజు కూడా వహించని ‘షా’ అనే బిరుదు పొందాడు. దాంతో షాజహాన్​గా రాజసింహాసనం పక్కనే దర్బారులో మరో ఆసనంలో కూర్చునే అర్హత, ఏ మొఘల్ యువరాజైనా ఆశించే అధికార హోదా దక్కాయి. ఆ తర్వాత మూడేండ్లు తండ్రి పక్కన కూర్చున్న ఆయన కొత్త స్నేహితుల్ని సంపాదించుకుని, సొంత కాళ్లపై నిలబడగలనని అర్థం చేసుకున్నాడు. ఈక్రమంలో మళ్లీ దక్కన్​లో క్లిష్టపరిస్థితి ఎదురైంది. ఈసారి కూడా చక్రవర్తి యువరాజునే ఎంచుకున్నాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం విధులను సక్రమంగా నిర్వర్తించాడు. ఇలా ఉండగా ఆయన పరువు మర్యాదలు పోగొట్టాలని నూర్జహాన్​ అవకాశం కోసం ఎదురుచూసింది. షా అబ్బాస్​, కాందహార్​ని ఆక్రమించుకున్నాడని తెలియడంతో జహంగీర్​ కొడుకును పశ్చిమానికి పంపాడు. కానీ, అతడు కాందహార్​ వెళ్లడానికి ముందు కొన్ని షరతులు పెట్టడంతో తండ్రి ఉగ్రుడయ్యాడు. 

►ALSO READ | సోషల్ ఇష్యూస్‌‌‌‌పై స్పూఫ్ వీడియోలు.. 20 లక్షలకి పైగా సబ్‌స్క్రైబర్లు.. పాపులర్ అవ్వడానికి ఈ జర్నీ తెలుసుకోండి!

షాజహాన్ తిరుగుబాటు చేయడంతో అది రాజ్యాన్ని చాలా సంవత్సరాల వరకు గందరగోళంలో పడేసింది. హోదా పోయింది. అతన్ని ఒకచోటు నుంచి మరో చోటుకి తరిమారు. అలా గతంలో శత్రువైన మాలిక్ అంబర్ దగ్గర ఆశ్రయం కోరాడు. అతడు ఆయన్ను జునార్​లో ఉంచాడు. అప్పుడే తన తండ్రి మరణవార్త తెలిసింది. ఆయన మామ అతన్ని తిరిగి ఆగ్రాకు వచ్చి భారతసామ్రాట్​గా ప్రకటించుకోమని చెప్పాడు. షాజహాన్​ సింహాసనాన్ని అధిష్టించాక మొఘల్ సామ్రాజ్యంలో ఎన్నడూ లేని ప్రశాంతత, సంపదలు వచ్చాయి. ఆయన పరిపాలనాకాలం దేశంలో నిరంతరాయ సైనిక విజయాలను చూసింది. 

షాజహాన్ రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చి దానికి షాజహానాబాద్​ అని పేరుపెట్టాడు. ఇక్కడ 1639లో లాల్​ ఖిల్లా లేదా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఎర్ర కోట నిర్మాణం ప్రారంభమైంది. అది పూర్తవ్వడానికి 9 ఏండ్లు పట్టింది. షాజహాన్​కు శిల్పకళాపోషణ మాత్రమే కాదు పెయింటింగ్స్ మీద కూడా ఆసక్తి ఉండేది. ఆయన ఎన్నో విలువైన రాళ్లను రాశులుగా సంపాదించాడు. వాటిలో కొన్ని తన పద్ధతిలో ప్రదర్శించేవాడు. కొన్నింటిని ధరించేవాడు. నెమలి సింహాసనం వాటిలో ఒకటి. 1666 జనవరి 7న ఆయనకు బాగా జ్వరం వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో 22న మరణించాడు. .

- మేకల మదన్​మోహన్​ రావు, కవి, రచయిత-