కష్టపడి చదివాడు. చిన్న వయసులోనే మర్చంట్ నేవీలో ఉద్యోగం సాధించాడు. ఒకసారి సెలవులపై ఇంటికి వచ్చినప్పుడు వీడియోలు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు అఖిల్. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తన మలయాళ కామెడీ కంటెంట్‌తో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. సోషల్ ఇష్యూస్‌పై స్పూఫ్ వీడియోలు చేసి మరింత పాపులర్ అయ్యాడు. దాంతో సోషల్ మీడియా అతని మనసుని కట్టిపడేసింది. అందుకే ఉద్యోగాన్ని లాంగ్ హైయేటస్‌లో పెట్టి ఫుల్ టైం యూట్యూబర్‌గా మారిపోయాడు.
అఖిల్ కేరళలోని అలప్పుజా జిల్లా నూరనాడులో 1995 డిసెంబర్ 5న పుట్టాడు. అతనికి చిన్నప్పటినుంచి సోషల్ మీడియా మీద బాగా ఇంట్రస్ట్ ఉండేది. దాంతో అప్పుడప్పుడు టిక్‌టాక్‌లో వీడియోలు చేసేవాడు. అలా ఇప్పుడు ఫుల్ టైమ్ యూట్యూబర్‌గా మారిపోయాడు. ఇంతకీ అతని సోషల్ మీడియా జర్నీ ఎలా మొదలైంది? సక్సెస్ ఎలా వచ్చింది? అతని మాటల్లోనే..
టిక్‌టాక్‌తో మొదలు
మొదట్లో వీడియో క్రియేషన్‌పై ఆసక్తితో టిక్‌టాక్ వీడియోలు చేశా. కానీ.. కొన్నాళ్లకే దేశంలో టిక్‌టాక్ బ్యాన్ అయ్యింది. దాంతో అందరిలాగే నేను కూడా కొంచెం బాధపడ్డాను. అయితే.. అప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వీడియోలు చేయడం మొదలుపెట్టా. దానివల్ల పెద్దగా ఇబ్బంది కలగలేదు. అలా జీవితం సాఫీగా సాగుతున్న టైంలో కరోనా వచ్చింది. అదేటైంలో నేను సెలవులపై ఇంటికి వచ్చా. అప్పుడు ఎక్కువ టైం దొరకడంతో యూట్యూబ్‌లో కంటెంట్ వీడియోలు చేశా. వ్యూయర్స్ నుంచి వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రెగ్యులర్‌గా వీడియోలు చేయాలని కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ నన్ను మరిన్ని వీడియోలు చేసేలా ప్రేరేపించాయి. అయితే... అదే టైంలో కొంతమంది నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నా. కానీ.. మా నాన్న, అమ్మ, అమ్మమ్మ, చెల్లెలు నాకు బాగా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ వల్లే విమర్శలను పట్టించుకోకుండా ముందడుగు వేశా.
ఫ్రెండ్స్ సాయంతో..
మొదట్లో ఒక్కడినే వీడియోలు చేసేవాడిని. తర్వాత నా ఫ్రెండ్స్‌ని కూడా సోషల్‌మీడియాలోకి తీసుకొచ్చా. చిన్నప్పటి నుంచి మేము ఒకరికొకరం బాగా తెలుసు. కాబట్టి, ఆ కెమిస్ట్రీ వీడియోల్లో వర్క వుట్ అయ్యింది. ఇప్పుడు మేం ఆరుగురం.. నాతో పాటు షియాస్, అఖిల్ ప్రసాద్, అనంతు రాహుల్, అక్షయ్, అరుణ్ వీడియోలు చేస్తున్నారు. వీడియో లకు వెన్నెముక కంటెంట్. అది వ్యూయర్స్‌ని ఆలో చింపజేయాలి లేదంటే ఆనందపరచాలి. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రేక్షకులకు నచ్చే కంటెంట్ మాత్రమే ఎంచుకుంటాం. వీడి యో షూట్‌కి ముందు రోజు అందరం కలిసి ప్లాన్ చేసుకుంటాం. తర్వాత రోజు షూట్ చేసి, ఎడిట్ చేస్తాం.
ఫుల్ పాపులర్..
అఖిల్ 2015లో తన మెయిన్ చానెల్ ‘అఖిల్ ఎన్‌ఆర్డీ’ని ప్రారంభించాడు. 2020లో తన మొదటి వీడియో అప్‌లోడ్ చేశాడు. క్రియేటివ్ కామెడీ స్పూఫ్‌లతోపాటు ప్రజలను ఆలోచింపజేసే వీడియోలతో మరింత పాపులారిటీ సంపాదించాడు. ప్రస్తుతం చానెల్‌కు 4.68 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. తన సెకండరీ చానెల్ ‘అఖిల్ NRD వ్లాగ్స్’ని 9.36 లక్షల మంది సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు. అఖిల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది. అతని పేజీని 18 లక్షలకు పైగా ఫాలో అవుతున్నారు. యూట్యూబ్‌లో 20 లక్షలకి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అంతేకాదు.. 2022లో ఫ్లవర్స్ ట్వంటీఫోర్ సోషల్ మీడియా అవార్డ్స్‌లో బెస్ట్ మేల్ ఎంటర్‌టైనర్ అవార్డు గెలుచుకున్నాడు.
మర్చంట్ నేవీ నుంచి యూట్యూబ్..
సెలవులు పూర్తవడంతో నేను తిరిగి ఉద్యోగానికి వెళ్లాల్సి వచ్చింది. నా మనసు మాత్రం అందుకు అంగీకరించలేదు. వీడియో కంటెంట్ మీద నాకున్న ప్రేమ నన్ను కట్టిపడేసింది. దాంతో మరికొన్ని రోజులు వీడియోలు చేయడానికి అనుమతించాలని నా పైఅధికారులకు రిక్వెస్ట్ పెట్టుకున్నా. వాళ్ల నుంచి నాకు ఫుల్ సపోర్ట్ లభించింది. దాంతో ఫుల్ టైం యూట్యూబర్‌గా మారిపోయా.
ఫహద్ ఫాజిల్‌లా..
నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘అక్షయ సెంటర్’ పేరుతో చేసిన ఒక షార్ట్ వీడియో అనుకోకుండా వైరల్ అయ్యింది. అప్పటినుంచి యూట్యూబ్‌లో సబ్‌స్క్రయిబర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఫహద్ ఫాజిల్ నటించిన మాలిక్ సినిమా రిలీజైనప్పుడు నేను దానికి సంబంధించిన కొన్ని వీడియోలు చేశా. వాటికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది నన్ను ఫహద్ ఫాజిల్ లాగా కనిపిస్తున్నావని, అతని లాగే యాక్టింగ్ చేస్తు న్నాని కామెంట్లు పెట్టారు. అవి నాకు మరింత ఎనర్జీని ఇచ్చాయి.
యూట్యూబ్ మాత్రమే..
నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, గౌరవం. కానీ, నాకు ఎప్పుడూ సినిమాల్లో నటించాలి అనిపించలేదు. అందుకే సినిమా ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదు. సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతాననే గ్యారెంటీ లేదు. సినిమాల కోసమని యూట్యూబ్‌ని వదిలిపెట్టుకోవడం సరైన నిర్ణయం కాదనిపించింది. ప్రస్తుతం యూట్యూబ్ వీడియోల్లో మాత్రమే యాక్టింగ్ చేస్తున్నా.
