నల్లమల అడవులు బాగున్నయ్! : జ్ఞానేశ్ కుమార్

నల్లమల అడవులు బాగున్నయ్! : జ్ఞానేశ్ కుమార్
  • కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ 

అమ్రాబాద్, వెలుగు: నల్లమల అటవీ అందాలు, జీవ వైవిధ్యం, పర్యాటకం ఎంతో బాగున్నాయని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ పేర్కొన్నారు.  ఆయన  కుటుంబ సమేతంగా శనివారం శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ కు వెళ్తూ.. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని తెలంగాణ టూరిజం మృగవని  గెస్ట్ హౌస్‌లో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని అటవీ సంపదపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్‌, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర నుంచి  వివరాలు అడిగి తెలుసుకున్నారు.  

జిల్లాలో బూత్ స్థాయి ఓటర్ల నమోదు ప్రక్రియ, జాబితాల సవరణ, ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న ముందస్తు ఏర్పాట్లపైనా సమాచారం తెలిపారు.  అనంతరం అమ్రాబాద్ ఎకో ఫారెస్ట్ ప్రత్యేక జ్ఞాపికను జ్ఞానేశ్ కుమార్ కు జిల్లా అధికారులు అందజేశారు.  జిల్లా అధికారుల పనితీరును ఆయన అభినందించారు.హైదరాబాద్​లో   గోల్కొండ కోట, రాణి మహల్, అక్కన్న మాదన్న ఆలయం,  హుస్సేన్​సాగర్ లో బుద్ధ విగ్రహాన్ని సందర్శించారు.  చార్మినార్  పైకెక్కి నగర అందాలను వీక్షించారు.  లాడ్ బజార్​లో  షాపింగ్ చేశారు.  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్,  అధికారులు ఉన్నారు.