- ఎంపీడీవో ఆఫీస్ఎదుట గ్రామస్తుల ఆందోళన
- జిల్లా కోర్టు, హైకోర్టులోనూ పిటిషన్, సోమవారం విచారణ
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం శేరిగూడ సర్పంచ్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎంపీడీవో ఆఫీసు ముందు గ్రామస్తులు శనివారం ఆందోళనకు దిగారు. ఎంపీడీవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ అభ్యర్థిని చీర మౌనిక మాట్లాడుతూ.. సర్పంచ్ స్థానం జనరల్స్థానానికి కేటాయించగా, ఇద్దరు బీసీలు, ఒక ఓసీ పోటీ చేశారని తెలిపారు. గ్రామంలో మొత్తం 900 ఓట్లు ఉండగా, ఓసీ అభ్యర్థి 18 ఓట్లతో గెలిచారన్నారు. పోలింగ్ రోజు రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీ ఏడీఏ నవనీత ఆర్వోగా వచ్చి ఓటర్లను ప్రభావితం చేసినట్లు ఆమె ఆరోపించారు. అగ్రికల్చర్ ఆఫీసర్లకు డ్యూటీ పడకపోయినా పీవోగా డ్యూటీ వేయించుకుని ఆర్వోగా డ్యూటీ చేసి వృద్ధుల ఓట్లు వేశారని మండిపడ్డారు.
ఓటర్లకు సర్పంచ్ స్లిప్ లు ఇవ్వకుండా వార్డు బ్యాలెట్ మాత్రమే ఇచ్చి, సర్పంచ్‌కు ఆమె ఓట్లు వేశారని మౌనిక ఆరోపించారు. కౌంటింగ్సమయంలోనూ ఏజెంట్లకు సంబంధం లేకుండా బాక్సులు ఓపెన్ చేశారని, టీ బ్రేక్ ఇచ్చి తమకు పడ్డ ఓట్లను చెట్లకుండా చేశారని పేర్కొన్నారు. ఇదే విషయమై ఎంపీడీవోను అడిగితే ఎంఈవో చెప్పారని డ్యూటీ వేశామని, తనను ఇన్వాల్వ్ చేయొద్దని అన్నారని మండిపడ్డారు. దీంతో సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేయవద్దని జిల్లా కోర్టులో పిటిషన్, హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశామని, సోమవారం విచారణ ఉందని ఆమె వెల్లడించారు.
