వయసుతో సంబంధం లేకుండా క్రీడల్లో పాల్గొనాలి : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

వయసుతో సంబంధం లేకుండా క్రీడల్లో పాల్గొనాలి : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

నల్గొండ, వెలుగు:  వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు క్రీడలు ఆడాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. నల్గొండ కేంద్రంలోని ఎన్జీ కాలేజీ మైదానంలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్గొండ ప్రీమియర్ లీగ్-6 క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రదానోత్సవంలో  ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఫస్ట్, సెకండ్ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు నగదు చెక్కులు, ట్రోఫీలు అందజేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే కాలంలో మునుగోడు నియోజకవర్గంలో ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్ ఉన్న పేద విద్యార్థులను గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా సహకరిస్తామన్నారు.  మునుగోడులో క్రికెట్, ఫుట్‌‌బాల్ వంటి ఆటల కోసం పది ఎకరాల స్థలంలో కొత్త స్టేడియం ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, టోర్నమెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు.  

ఆరోగ్యవంతులు రక్తదానం చేయాలి 

కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ త్రిపాఠి ప్రారంభించి, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  సేకరించిన రక్తం ఆపద సమయంలో పేద ప్రజలకు ఉపయోగపడతుందన్నారు.  నిర్వాహకులను, రక్తదాతలను అభినందించారు. ఈ శిబిరంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, ఎస్సైలు, మాజీ కౌన్సిలర్లు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.