యువత డ్రగ్స్‌‌ కు దూరంగా ఉండాలి : డాక్టర్ ఎం. రాధాకృష్ణ చౌహాన్

యువత డ్రగ్స్‌‌ కు దూరంగా ఉండాలి : డాక్టర్ ఎం. రాధాకృష్ణ చౌహాన్

సూర్యాపేట, వెలుగు:  దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన యువత ఆల్కహాల్‌‌, గంజాయి, డ్రగ్స్‌‌ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఒకటో అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి డాక్టర్ ఎం. రాధాకృష్ణ చౌహాన్ పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్‌‌లో భాగంగా జనబంధు ఫౌండేషన్, హోలీ క్రాస్ ఫౌండేషన్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మాదకద్రవ్య నిర్మూలన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సూర్యాపేటను డ్రగ్స్  రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమన్నారు.  యువత డ్రగ్స్‌‌కు దూరంగా ఉండాలని సూచించారు.  అనంతరం జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి (ఎఫ్‌‌ఏసీ) ఫర్హీన్ కౌసర్ మాట్లాడుతూ..  సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో యువత డ్రగ్స్ వైపు ఆకర్షితులవడం విచారకరమన్నారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం, క్రీడలు వంటి ఆరోగ్యకరమైన మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.  

జనబంధు, హోలీ క్రాస్ ఫౌండేషన్ స్థాపకుడు గోదా సత్యనారాయణ, హోలీ క్రాస్ ప్రతినిధి మిడతపల్లి గణపతి, బార్ కౌన్సిల్ సభ్యులు కొంపల్లి లింగయ్య, రాచకొండ ప్రభాకర్, డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్ కో-ఆర్డినేటర్లు కంది కావేరి, నల్లగట్టు ఉపేందర్, జనబంధు ప్రతినిధులు ఝాన్సీ రాణి, ఎరకలి జ్యోతి, ఉపాధ్యాయులు, వివిధ కళాశాలల విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.