- జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపులో న్యాయవాదుల పాత్ర కీలకం: పొన్నం
- రాజకీయాల్లో ఓపిక ఉంటేనే పదవులొస్తయ్: వివేక్ వెంకటస్వామి
- పీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు సన్మానం
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం వెనక అడ్వకేట్లు కీలక పాత్ర పోషించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తాను కూడా అడ్వకేట్‌నని, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో కొనసాగుతున్నానని చెప్పారు. శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..“న్యాయవాద వృత్తిపై నాకు అవగాహన ఉంది.
మా ఇంట్లోనూ అడ్వకేట్లు ఉన్నారు. కొత్తగా వృత్తిలోకి వచ్చిన న్యాయవాదులకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో కూడా నాకు తెలుసు. వారందరి సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తా” అని మంత్రి హామీ ఇచ్చారు. న్యాయవాదులకు సంబంధించిన నియామకాల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేస్తామన్నారు. బైపోల్‌లో నవీన్ యాదవ్ గెలవాలని తన సతీమణితోపాటు మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి కూడా ప్రచారం చేశారని గుర్తు చేసుకున్నారు.
అందరి అండతోనే గెలిచా: నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తనకు టికెట్ ఇచ్చినందుకు పార్టీ హైకమాండ్ కు, సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటానని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందే మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు రూ.కోట్లతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. తన విజయం కోసం పొన్నం అశోక్‌గౌడ్ నేతృత్వంలో న్యాయవాదులు ఎంతో కృషి చేశారని, ప్రభుత్వ స్కీమ్ లను ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు.
17 ఏండ్లుగా నియోజకవర్గంలో తన తండ్రి, తాను అనేక ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అండగా ఉంటామన్న నమ్మకంతోనే కార్యకర్తలు, ప్రజలు కష్టపడి తనను గెలిపించుకున్నారన్నారు. తనపై కేసులు పెట్టి, ఇబ్బందులకు గురిచేసినా, ప్రజల ఆశీర్వాదం పొందానని వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో యూత్‌ను ఎంకరేజ్ చేయాలి: మంత్రి వివేక్
రాజకీయాల్లో నేతలకు ఎంతో ఓపిక ఉండాలని, అపుడే పదవులు వస్తాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి సామాజిక కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉన్నందునే నవీన్ యాదవ్ ను జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించుకున్నారని అన్నారు. ఇలాంటి యూత్ లీడర్లను రాజకీయాల్లో ఎంకరేజ్ చేయాలని సూచించారు. జంటనగరాల్లో యాదవులు, మున్నూరుకాపులు అధికంగా ఉన్నారన్నారు. అందుకే నవీన్‌కు టికెట్ ఇవ్వాలని పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు, సీఎం రేవంత్ కు, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కు తాను సిఫారసు చేశానన్నారు.
సీఎం కూడా సర్వే చేసి నవీన్‌కు టికెట్ ఇచ్చారన్నారు. కేసులు ఉన్నాయని, ఓడిపోతాడంటూ తప్పుడు ప్రచారం జరిగినా.. నవీన్ గెలుపుపై తనకు మొదటి నుంచి నమ్మకం ఉందన్నారు. తాను, పొన్నం, తుమ్మల, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం చేయడంతో మంచి మెజారిటీతో గెలవడంతోపాటు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెంచుకున్నామన్నారు.
