- జిల్లా స్థాయి ఇన్ స్పైర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల, కలెక్టర్
ఖమ్మం టౌన్, వెలుగు: ప్రపంచ స్థాయి పోటీలకు మన విద్యార్థులను సన్నద్ధం చేయాలని వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి తుమ్మల శనివారం ఖమ్మం నగరం బల్లేపల్లి లోని ఎస్.ఎఫ్.ఎస్. స్కూల్లో జిల్లా స్థాయి ఇన్ స్పైర్ కార్యక్రమాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. 900 ఎగ్జిబిట్స్ జిల్లా స్థాయి వైజ్ఞానిక ఎగ్జిబిషన్ కు రావడం మన పిల్లల సృజనాత్మకతకు నిదర్శనమన్నారు.
విజ్ఞాన ప్రదర్శనల వల్ల పిల్లలకు మెరుగైన భవిష్యత్తు లభిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతంలో తల్లిదండ్రులు పడిన కష్టాలను చూసి కొంత మంది ఆడపిల్లలు ఆలోచించి వ్యవసాయ పనులను ఒకే యంత్రం చేసేలా తయారు చేశారని తెలిపారు. ఖమ్మం జిల్లా విద్యారంగంలో భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. విద్యా వ్యవస్థలో ఎటువంటి అవసరం ఉన్న వెంటనే విద్యాశాఖ అధికారులు కలెక్టర్ ను సంప్రదించాలన్నారు.
అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. ఎస్,.ఎఫ్. ఎస్. పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ఇన్ స్పైర్ వైజ్ఞానిక ఎగ్జిబిషన్ కార్యక్రమానికి 900 పైగా ఎగ్జిబిట్స్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పాఠశాలలో చదివిన జ్ఞానం ప్రాక్టికల్ గా ఎక్కడ ఎలా వాడాలి అనే అంశాన్ని విద్యార్థులు లోతుగా ఆలోచించాలన్నారు. అప్పుడే చదువు మనకు బాగా ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ పర్యటనలో మంత్రి వెంట రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీఈవో చైతన్య జైని, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, కార్పొరేటర్లు మల్లీదు వెంకటేశ్వర్లు, కమర్తపు మురళీ, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
