- కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్‌టౌన్, వెలుగు: పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని, అత్యవసరమైతే తప్ప టీచర్లు సెలవులు పెట్టొద్దని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శనివారం మెదక్కలెక్టర్ ఆఫీసులో విద్యాధికారులు, టీచర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులందరికీ సిలబస్ పూర్తి చేయాలన్నారు. ఇకనుంచి ప్రతీ రోజు విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలిస్తానన్నారు. ప్రతీ విద్యార్థి యాక్షన్ ప్లాన్ ను తయారు చేయాలన్నారు. పది తర్వాత ఇంటర్ ఎక్కడ జాయిన్ అవుతారో రిపోర్టు తయారు చేయాలని సూచించారు.
స్కూళ్లలో వంట చేయడానికి ఎల్పీజీ గ్యాస్ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. మధ్యాహ్న భోజనంలో సమస్యలుంటే అధికారులు తన దృష్టికి తీసుకురావాలన్నారు. పోక్సో కమిటీలు ఏర్పాటు చేసి కిశోర బాలికలకు అవగాహన కల్పించాలని సూచించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో వంద శాతం రిజల్ట్ రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేజీవీబీల్లో టీచర్లు వారి మీద వారే ఫిర్యాదు చేసుకుంటే చర్యలు తప్పవన్నారు. పీఎంశ్రీ స్కూళ్లలో ఉపాధి హామీ ద్వారా పెండింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు.
అనంతరం మెదక్ డీఈవోగా పనిచేసి డైట్ ప్రిన్సిపాల్‌గా వెళ్లిన రాధా కిషన్‌ను సన్మానించారు. అనంతరం మత్తు పదార్థాలు నిర్మూలించాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీఈవో విజయ, డైట్ కాలేజ్ ప్రిన్సిపాల్ రాధాకిషన్ డీఎస్వో రాజిరెడ్డి, సుదర్శనమూర్తి, ఎంఈవోలు, హెచ్ఎంలు, కేజీబీబీ స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులు హెల్ప్ డెస్క్ ద్వారా స్వీకరణ
జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారాలు, విపత్తుల మాక్ ఎక్సర్సైజ్ నిర్వహణ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉన్నారని దీంతో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు హెల్ప్ డెస్క్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
ఈ నెల 23న మీ డబ్బు మీ హక్కు' ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏళ్ల తరబడి క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలను వారి ఖాతాదారులకు చేరేలా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మహిళా శక్తి భవన్ పనులను స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ ఈఈ నర్సింలుతో కలిసి మహిళా శక్తి భవనం నిర్మాణ పనులను పరిశీలించారు.
