ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు రోజురోజుకు పెరుగుతున్న వేళ బంగారం ప్రేమికులకు ఊహించని వార్తలు అందుతున్నాయి. ఇరాన్‌పై కొనసాగుతున్న దాడుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో తులం బంగారం ధర రూ.2 లక్షల మార్కును చేరుకుంటుందా? అనే ఉత్కంఠ ఇన్వెస్టర్లలో నెలకొనగా.. రిటైల్ కొనుగోలుదారులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.
సరికొత్త రికార్డుల దిశగా గోల్డ్
ప్రస్తుతం దేశీయంగా MCX మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.లక్షా 62వేల104 వద్ద ఉంది. అయితే అంతర్జాతీయంగా కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఒక ఔన్సు ధర 5,267 డాలర్లు దాటిపోయింది. వరుసగా 8 నెలల నుంచి బంగారం పెరుగుతూనే ఉండటం గమనార్హం. యుద్ధం గనుక సుదీర్ఘకాలం కొనసాగితే.. భారత్‌లో గోల్డ్ రేట్లు త్వరలోనే రూ.లక్షా 80వేల ఆల్-టైమ్ రికార్డును తాకవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
రూ.2 లక్షల మార్కు సాధ్యమేనా..?
ప్రస్తుతానికి బంగారం రేటు 10 గ్రాములకు రూ.లక్షా 70వేల దిశగా వెళ్తున్నప్పటికీ.. యుద్ధ తీవ్రత పెరిగితే రూ.2 లక్షల మార్కు అసాధ్యమేమీ కాదని మార్కెట్ వర్గాల విశ్లేషణ. ఐఎన్‌వి అసెట్ పీఎంఎస్ బిజినెస్ హెడ్ హర్షల్ దసాని అభిప్రాయం ప్రకారం.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు, వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేయడం, డాలర్ విలువ తగ్గడం వంటి అంశాలు బంగారం రేట్ల పెరుగుదలకు కలిసి వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే 12 నుంచి 18 నెలల్లో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 6వేల డాలర్ల మార్కును తాకితే, భారత్‌లో తులం బంగారం రూ.2 లక్షలకు చేరువయ్యే అవకాశం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
►ALSO READ | వెండి.. మళ్లీ రూ. 4 లక్షలు అవుతుందా లేక రూ.5 లక్షలు అవుతుందా..?
దుబాయ్ మార్కెట్లోనూ సెగ
అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం దుబాయ్ గోల్డ్ మార్కెట్‌పై కూడా పడనుంది. ధరలు 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోకుండా తమ పెట్టుబడులను బంగారంలోకి మళ్లిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. యుద్ధం గనుక రష్యా-ఉక్రెయిన్ తరహాలో ఏళ్ల తరబడి సాగితే, ముడి చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ప్రజలపై భారంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఇది పరోక్షంగా బంగారం ధరలను సామాన్యుడికి అందనంత ఎత్తుకు తీసుకెళ్లే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
