- బండిని తొలగించేందుకు వెళ్లిన పోలీసులపై దాడి
- ఆదిలాబాద్ జిల్లా చిన్నబుగ్గారంలో తీవ్ర ఉద్రిక్తత
నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో సర్పంచ్ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి, ఓడిన అభ్యర్థి మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. నేరడిగొండ మండలం చిన్న బుగ్గారం సర్పంచ్ ఎన్నికల్లో మహిళా అభ్యర్థి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆమె భర్త రాథోడ్ మోహన్ ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. తమ ఇంటి వద్ద గ్రామ ప్రధాన రోడ్డుపై ఎవరూ వెళ్లకుండా ఎడ్ల బండిని అడ్డంగా పెట్టాడు. తనకు ఓటు వేయనివాళ్లు వెళ్లవద్దని హెచ్చరించాడు.
గ్రామస్తులు చేసేదేమీ లేక పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి వెళ్లి రోడ్డుకు అడ్డంగా ఉన్న ఎడ్ల బండిని తొలగిస్తుండగా ఓడిన అభ్యర్థి మద్దతుదారులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, మోహన్ వర్గీయులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులపై మోహన్ వర్గీయులు రాళ్లతో దాడి చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఐ సయ్యద్ ఇమ్రాన్, పోలీసులకు గాయాలు అయ్యాయి. దాడికి పాల్పడ్డవారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
