- అధికారుల మున్సిపల్ ఆఫీస్ ముందు బీజేపీ ఆందోళన
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ప్రజలను బెదిరిస్తూ ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారని, చెల్లించని వారి ఇంటికి తాళాలు వేస్తామని హెచ్చరించడం ఏమిటని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఆకుల శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, పట్టణ అధ్యక్షుడు కీర్తి మనోజ్ ప్రశ్నించారు. శనివారం మున్సిపల్ ఆఫీసు ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణం మున్సిపాలిటీగా ఏర్పడి ఏడేండ్లు గడిచినా ఇక్కడ మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.15 కోట్లు మంజూరు చేసిందని చెబుతున్నా ఇప్పటివరకు ఎలాంటి పనులు చేపట్టలేదని విమర్శించారు.
కోతుల నివారణ కోసం చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులు ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ పట్టణ అభివృద్ధిపై లేదన్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్య లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు రవీందర్ రెడ్డి, సందుపట్ల శ్రావణ్, ఉపేందర్, భూమన్న, అనిల్ రావు, సందీప్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
